తీరొక్క మొక్క.. పల్లె లెక్క | Sakshi
Sakshi News home page

తీరొక్క మొక్క.. పల్లె లెక్క

Published Thu, Apr 27 2023 10:11 AM

The Yadadri Collectors Bungalow Looks Like A Garden - Sakshi

కనుచూపు మేర కనువిందుచేసే పచ్చిక..ఆహ్లాదాన్ని పంచే పూలతో పాటు ఇతర మొక్కలు.. నీటిలో ఈదులాడే చేపలు, బాతులు..చెట్టు కింద ధ్యానముద్రలో బుద్ధుడు..పక్కనే తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఎడ్లబండి.. అక్కడే సాగుపనిలో నిమగ్నమైన రైతుదంపతులు.. భవనం గోడలపై అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు.. పచ్చికపై ఆడుకుంటున్న చిన్నారులు.. కుందేళ్ల పరుగులు.. పక్షుల కిలకిలారావాలు..వేపచెట్టుకు కట్టిన ఊయల.. ఓపెన్‌ జిమ్‌.. ఇదీ అక్కడ అడుగుపెడితే కనిపించే అందమైన ‘పల్లె దృశ్యం’. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ బంగ్లాలో..  

పర్యావరణహితంగా.. 
యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌తోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్‌ బంగ్లాలను గతేడాది ఫిబ్రవరి 12న ప్రారంభించారు. బంగ్లాలో చేరిన కలెక్టర్‌ పమేలా సత్పతి కేవలం 3 నెలల్లోనే తన అభిరుచికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. కొత్త ఆవిష్కరణలకు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్‌కు బంగ్లాను వేదికగా మార్చారు. పర్యావరణహితంగా, సేంద్రియ పద్ధతిలో గార్డెనింగ్, టెర్రస్, కిచెన్‌ గార్డెనింగ్‌ నిర్వహిస్తూ పలురకాల పూలమొక్కలు పెంచుతున్నారు. కలెక్టర్‌గా క్షణం తీరికలేకుండా గడిపే ఆమె కొద్ది సమయం చిక్కినా మొక్కల సంరక్షణలోనే గడుపుతారు. బంగ్లాను ఉద్యానవనంగా మార్చిన ఆమె.. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన గార్డెన్‌ ఫెస్టివల్‌–2023లో సేంద్రియ పద్ధతిలో పర్యావరణహితంగా చేపట్టిన వ్యక్తిగత గార్డెనింగ్‌ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్నారు.  

ఎటుచూసినా పచ్చదనం.. పూల అందాలే..
కలెక్టర్‌ బంగ్లా టెర్రస్‌ వందల రకాల మొక్కలతో చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తోంది. ఇక బంగ్లా ఆవరణ 400 రకాల మొక్కలకు నెలవైంది. వాటి రక్షణకు విభిన్నమైన కుండీలు పెట్టారు. నీటి మొక్కల కోసం తొట్లను ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ బంగ్లా కిటికీలు, ఇంట్లోకి వెళ్లే కారిడార్, వరండా.. ఇలా ఆవరణ మొత్తం అందమైన మొక్కలతో నింపేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కొత్త మొక్కలు సేకరించి.. వాటిని తన బంగ్లా ఆవరణలో నాటడం పమేలాకు అలవాటు. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన మొక్కలు పెంచుతున్న వారి దగ్గర నుంచీ కొన్నింటిని తెచ్చారు. వృథా సామగ్రి, రాళ్లు, ఇసుక, రకరకాల మట్టితో గార్డెనింగ్‌ నిర్వహిస్తున్నారు.  

మొక్కలంటే ప్రాణం.. 
మొక్కలంటే నాకు ప్రాణం. ఉద్యోగ నిర్వహణలో ఎక్కడికి బదిలీపై వెళ్లినా నా వెంట లగేజీతోపాటు మొక్కలను కచ్చితంగా తీసుకెళ్తా. మా అమ్మ వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో పదేళ్లప్పటి నుంచే నాకూ మొక్కలంటే ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు మా అమ్మతో వెళ్తే అక్కడ కొందరు నాకు మొక్క లు బహుమతిగా ఇచ్చేవారు. అలా నాకు మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగింది. నేను ప్రస్తుతం ఉంటున్న బంగ్లాలో 400 మొక్కల తొట్లు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నా మొక్కల సంరక్షణకు రోజూ కొంత సమయం కేటాయిస్తాను.  

– పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement