సీతారామ ద్వారా జలాల మళ్లింపు
పర్యావరణ అనుమతుల కోసం కృషి చేయాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి జలాలను సాగర్ ఎడమ కాల్వ వ్యవస్థకు తరలించి అక్కడి నుంచి పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు మళ్లించడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గురువారం జలసౌధలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతుల కోసం తీవ్ర కృషి చేయాలని, ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) క్లియరెన్స్ ఇప్పటికే లభించిందని, విధానపర జాప్యాలతో రైతులకు సాగునీటి ప్రయోజనాలు దూరం కాకూడదని స్పష్టం చేశారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి : ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని, సుప్రీం కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను న్యూఢిల్లీకి పంపాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు భూసేకరణ చాలా వరకు పూర్తైందని, కొన్ని అటవీ అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు.
జూలై నాటికి అటవీ అనుమతులను సాధించాలని, భూసేకరణను సాకుగా చూపి పనులు ఆలస్యం చేయకుండా కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలని ఉత్తమ్ ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, వనరులను సమీకరించి సాధ్యమైనన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
త్వరలో నిధుల విడుదల : జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకి రూ.200 కోట్లు అవసరమని, త్వరలో విడుదల చేస్తామన్నారు. అలాగే, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను కూడా వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ–1 ద్వారా ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలోని బయ్యారం ఎగువ గిరిజన ప్రాంతాలకు నీటిని ఎత్తిపోయాలనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం అథారిటీతో సమావేశం : పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్‌తో భద్రాచలం డివిజన్‌లో ముంపు సమస్యపై మంత్రి స్పందిస్తూ.. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. పక్షం రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. మరోవైపు సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన ఎన్‌జీటీ కేసులు, ఇతర న్యాయపర అడ్డంకులను తొలగించడానికి అడ్వకేట్ జనరల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.


