Amit Shah - Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటన భేష్‌.. జూ.ఎన్టీఆర్‌ను అభినందించిన అమిత్‌షా

union home minister amit shah meet jr ntr - Sakshi

ఆదివారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో భేటీ..

కలిసి భోజనం చేసిన సినీ హీరో, కేంద్ర హోంమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన బాగుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నోవాటెల్‌ హోటల్‌లో అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. దాదాపు 11.10 గంటల సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత నోవాటెల్‌ నుంచి బయటికి వచ్చిన బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను అభినందించేందుకే ఈ భేటీ జరిగిందని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన తెలిపారు.

అయితే అమిత్‌షా బిజీ షెడ్యూల్‌ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరాలని, సముచిత ప్రాధాన్యం ఇస్తామని జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌షా కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.   

చదవండి: అమిత్‌షాపై ఆ ప్రచారం తప్పు.. భయం వల్లే ఇలా చేస్తున్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top