రాష్ట్రంపై క్షయ పంజా.. ఐదు నెలల్లోనే 798 మంది మృతి.. దేశంలో 15వ స్థానం

Tuberculosis TB Deaths Report In Telangana - Sakshi

గతేడాది 1,876 మంది మృత్యువాత 

2021లో రాష్ట్రవ్యాప్తంగా 60,714 టీబీ కేసులు నమోదు 

దేశవ్యాప్తంగా టీబీ మరణాల్లో 15వ స్థానంలో తెలంగాణ 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. నాలుగైదు ఏళ్లుగా తెలంగాణలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు టీబీ కారణంగా 798 మంది మరణించారు. గతేడాది (2021) 1,876 మంది చనిపోయారు. క్షయ మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 15వ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇదేకాలంలో అత్యధికంగా 6,896 మంది మరణించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 2,845 మంది, గుజరాత్‌లో 2,675 మంది, మధ్యప్రదేశ్‌లో 2,450 మంది మరణించారు. 

రాష్ట్రంలో ఏడు నెలల్లో 33,907 కేసులు... 
రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడంలేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తించగా 2018లో 52,269 మందికి వ్యాధి సోకింది. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,209, 2021లో 60,714 మందికి వ్యాధి సోకింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు అంటే దాదాపు ఏడు నెలల్లో 33,907 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.

ఈ ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ఈ కాలంలో ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

2021 జనవరి–సెప్టెంబర్‌ మధ్య రాష్ట్రంలో టీబీ రోగులకు చికిత్స అందించగా 89 శాతం మంది నయమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విశ్లేషించింది. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా సక్సెస్‌ రేటు 97 శాతం ఉండగా జనగామ జిల్లాలో అత్యంత తక్కువగా 79 శాతమే ఉందని తెలిపింది. అదే కాలంలో 1,592 మంది వ్యాధి తగ్గక మరణించగా 192 మందికి చికిత్స విఫలమైందని పేర్కొంది. 28 మంది రోగులు వైద్యానికి నిరాకరించారని వివరించింది. 

ఆర్థిక సాయం 67 శాతం మందికే... 
క్షయ వ్యాధిగ్రస్తులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 500 అందిస్తోంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో అనేక మంది క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. దీంతో అనేక మంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి జూలై 25 వరకు 67 శాతం మందికి అంటే 22,795 మంది క్షయ రోగులకు ఆర్థిక సాయం అందగా మిగిలిన వారికి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఆదిలాబాద్‌లోని క్షయ రోగులకు అత్యధికంగా 91 శాతం మందికి ఆర్థిక సాయం అందింది. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లా బాధితులు 49 శాతమే సాయం పొందారు.

జనగామ జిల్లాలో 52 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 56 శాతం, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో 55 శాతం, కామారెడ్డి జిల్లాలో 57 శాతం చొప్పున ఆర్థిక సాయం అందింది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, చికిత్సపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని వైద్య నిపుణులంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top