రోజూ 45 వేల మంది భక్తులు 

Temple Officials Estimated That 45000 People Visit The Yadadri Temple Every Day - Sakshi

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాల సమయంలో రానున్నట్లు అంచనా 

వారందరికీ ఇబ్బంది తలెత్తకుండా రవాణా సౌకర్యం 

కొండపైకి 75 మినీ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం 

కొండపైకి ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు బంద్‌

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఉద్ఘాటన ఉత్సవాలు జరిగే సమయంలో రోజూ 45 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 75 మినీ బస్సులను కొండపైకి నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బస్సులు సేవలందిస్తాయి.  

జేబీఎస్, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచి ప్రత్యేక బస్సులు 
సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి పికెట్‌ డిపోకు చెందిన ఆరు బస్సులను నేరుగా యాదాద్రి కొండపైకి నడపనున్నారు. వీటితో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా ఏసీ వజ్ర బస్సుల్లో కూడా భక్తులను కొండపైకి చేర్చనున్నారు. ఇక యాదగిరిగుట్ట– భువనగిరి నుంచి నిరంతరం భక్తుల కోసం బస్సులు అందుబాటులో ఉంటాయి. కాగా, వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ఇతర డిపోల బస్సులు పాత బస్టాండ్‌లో భక్తులను దించుతాయి.

అక్కడనుంచి నేరుగా కొండపైకి వెళ్లేందుకు మినీ బస్సులు సిద్ధంగా ఉంటాయి. ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో కొండపైకి ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలను బంద్‌ చేయనున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం పాత గోశాల సమీపంలో తమ వాహనాలను పార్కింగ్‌ చేసి ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది.

34 అడుగుల ధ్వజస్తంభం కిలో 780 గ్రాములతో స్వర్ణతాపడం  
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన బంగారు ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. సుమారు 34 అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజ స్తంభానికి కిలో 780 గ్రాముల బంగారంతో తయారు చేసిన కవచాలను బిగించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా «బలిపీఠం, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top