యాదాద్రి ఈఓ మార్పు తప్పదా?

Telangana Yadadri Temple Chief Executive Officer Eo Likely To Change - Sakshi

వివాదాస్పద నిర్ణయాలతో యాదాద్రి ప్రతిష్టకు దెబ్బ!  

దిద్దుబాటు చర్యలపై సర్కారు దృష్టి 

ఐఏఎస్‌ లేదా రిటైర్డ్‌ ఐఏఎస్‌కు బాధ్యతలు

సాక్షి, యాదాద్రి: యాదాద్రి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(ఈఓ) గీతారెడ్డి మార్పు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. కూతురు వివాహం కోసం సెలవుపై వెళ్లిన ఈఓ గీతారెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే తాజాగా యాదాద్రిని చుట్టుముడుతున్న వివాదాలకు తెరదించడానికి ఈఓను తప్పించనున్నారని తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా వాస్తవ పరిస్థితులపై సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈఓ గీతారెడ్డి స్థానంలో ఐఏఎస్‌ లేదా రిటైర్డు ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.  

వివాదాస్పదమైన నిర్ణయాలు.. 
సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే మార్చి 28న ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత దేవస్థానంలో అమలు చేసిన పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భక్తులకు కనీస వసతులైన నీరు, నీడ కల్పించలేకపోవడం, కొండపైన పార్కింగ్‌ ఫీజు గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అదనంగా గంటకు రూ.100 పార్కింగ్‌ ఫీజు వసూలును ఎత్తివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రకటించడంతో భక్తులకు కొంత ఊరట కలిగింది. మరోపక్క స్థానిక ఆటోలను కొండపైకి నిషేధించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలసి పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ తీరుపై ఆటో కార్మికులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు గుట్టకు వచ్చినప్పుడు 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓకు సూచించారు.

దీంతో పాటు మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయించడంతో ఈఓ, మీడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే యాదాద్రిలో జరిగిన నష్టం వంటి పలు అంశాలు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈఓను మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top