Telangana Liberation Day 2022: Special Story On Parakala Fight And Parakala Amaradhamam - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు

Published Sat, Sep 17 2022 11:37 AM

Telangana Vimochana Dinotsavam 2022: Parakala Fight, Parakala Amaradhamam - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్‌ వాలాబాగ్‌ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్‌ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్‌ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. 

సెప్టెంబర్‌ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జియాఉల్లా, మేజిస్ట్రేట్‌ విష్ణువేశ్వర్‌ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్‌ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. 

ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్‌ (చల్లగరిగె), కలువాల అంకూస్‌ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. 

సాయుధ పోరాటానికి కేరాఫ్‌...
నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్‌ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్‌దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్‌ 17న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి:  ‘కొరియర్‌’గా.. వారియర్‌గా!)


రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్‌ రంజిత్‌

నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్‌.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం)

Advertisement
Advertisement