జాగు చేయక.. బాగు చేసేలా..

Telangana: SC ST Central Govt Specially Set Up Help Desk On Atrocities Act - Sakshi

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసిన కేంద్రం 

వెబ్‌ పోర్టల్‌ ద్వారా క్షణాల్లో అధికారులకు ఫిర్యాదు 

టోల్‌ఫ్రీ, హెల్ప్‌లైన్‌ నంబర్ల ద్వారా కూడా సంప్రదించవచ్చు 

తక్షణమే సంబంధిత అధికారులకు సూచనలు  

జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నం: 18002021989  
హెల్ప్‌లైన్‌ నం:14566  
రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్‌ నం: 040–23450923  

సాక్షి, హైదరాబాద్‌: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్‌) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్‌ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్‌డెస్క్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది.

ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్‌సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది.

అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్‌) నమోదు అయ్యాయి. 

ఫిర్యాదుల నమోదు ఇలా... 
హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్‌ హెల్ప్‌డెస్క్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్‌ యువర్‌ గ్రీవెన్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్‌ఐఆర్‌ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది.

అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్‌పోర్టల్‌ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది.

వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌పోర్టల్‌ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్‌ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్‌ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్‌ పంపడంతో పాటు 040–23450923 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి వినతులు చెప్పుకోవచ్చు. 

కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం 
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, వెబ్‌పోర్టల్, కాల్‌ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది.

ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్స్, ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్‌క్లూజివ్‌ స్పెషల్‌ కోర్ట్స్‌), స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top