‘అనర్హత’పై వివరణ ఇవ్వండి | Telangana High Court notices to Speaker and seven MLAs | Sakshi
Sakshi News home page

‘అనర్హత’పై వివరణ ఇవ్వండి

Mar 26 2026 2:29 AM | Updated on Mar 26 2026 2:29 AM

Telangana High Court notices to Speaker and seven MLAs

స్పీకర్, ఏడుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్లు విచారించిన సీజే ధర్మాసనం 

తదుపరి విచారణ ఏప్రిల్‌ 16కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌:  అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్‌ ఇచ్చిన తీర్పులను సవాల్‌ చేస్తూ పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ కమ్‌ ట్రిబ్యునల్‌ను, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్‌ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు తాజా పిటిషన్లు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్‌రావు, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ట్రిబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో విచారణ చేపట్టిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌.. వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. దీనిపై రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశ్‌గౌడ్, వెంకట్‌రావు, గాం«దీ, దానం నాగేందర్, కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 

స్పీకర్‌ ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు.. 
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్‌లో చేరడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియాల్లో కూడా ప్రసారమైంది. దానం నాగేందర్‌ ఏకంగా 2024లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటిపై బీఆర్‌ఎస్‌ అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. అవేవీ పరిశీలించకుండానే పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్‌ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. పిటిషన్లపై సత్వరమే విచారణ చేపట్టాలి..’అని కోరారు. దీంతో సీజే ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement