
ఆర్టీఐ కమిషన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి 404 కేసులు ఎలా విచారణ చేస్తారని.. ఏఏ కేసులు విచారణ చేస్తున్నారో తెలియజేయాలి కదా అని సమాచార హక్కు కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. పజా సంబంధాల అధికారులు, మొదటి అప్పిలేట్ అధికారులు తగిన సమాచారం ఇవ్వకపోవడంతో శ్యామ్ అనే వ్యక్తి రాష్ట్ర సమాచార కమిషన్‌లో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఇలా 404 కేసులు వేశారు. వీటిలో వాదనలు సమర్పించేందుకు రావాలంటూ శ్యామ్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇన్ని కేసుల విచారణ ఒకే రోజు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అతను హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 17 వేల కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఎక్కువ అప్పీళ్లు వేసిన పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఒకేసారి ఇన్ని కేసుల్లో పిటిషనర్ ఎలా వాదనలు వినిపిస్తారని ప్రశ్నించారు. నోటీసులను కొట్టివేస్తూ.. పూర్తి వివరాలతో మరోసారి జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించారు.