
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇద్దరు బిడ్డలకే పరిమితమా.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుపై ఉన్న పరిమితిని సవాలుచేస్తూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.శ్వేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2010, మే 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 152ను సవాల్ చేశారు. ఈ జీవో ప్రకారం 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులకు అనుమతి ఉంటుందని.. అయితే ఇద్దరు పిల్లలకే పరిమితమని పేర్కొన్నారు. పరిమితిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున జీపీ ఎస్.సుమన్ విచారణకు హాజరై.. ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వాయిదా వేసింది.