‘వెదురు’తో విద్యుత్‌! దేశంలోనే మొదటిసారిగా.. 50 ఏళ్లపాటు ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం

Telangana Government Plans To Use Bamboo In Thermal Power Plants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలే కొన్నేళ్లుగా తీవ్రంగా బొగ్గు కొరత.. ధరలు కూడా చుక్కలను తాకుతూ విద్యుదుత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గుతోపాటు వెదురునూ కలిపి విద్యుదుత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ వినూత్న ప్రతిపాదనలను తెర పైకి తెచ్చింది. వెదురును నేరుగా కాకుండా పెల్లెట్ల రూపంలోకి మార్చి వినియోగిస్తారు. ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు, బయోమాస్‌ పెల్లెట్లను థర్మల్‌ కేంద్రాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. 
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో తొలి రెండేళ్లపాటు 5శాతం, ఆ తర్వాత 7 శాతం బయోమాస్‌ పెల్లెట్లను బొగ్గుతో కలిసి ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వెదురుతో పెల్లెట్లను రూపొందించి థర్మల్‌ కేంద్రాల్లో వినియోగించేందుకు ఉద్యానశాఖ రంగం సిద్ధం చేసింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద భైంసా వద్ద 15 ఎకరాల్లో వెదురుసాగును చేపట్టింది. వెదురును పెల్లెట్స్‌గా మార్చే యంత్రాలనూ సిద్ధం చేసింది. కొంతమేర పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్‌టీపీసీకి పరిశీలన నిమిత్తం పంపించింది. మొత్తంగా రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. 

67 లక్షల టన్నుల పెల్లెట్స్‌ అవసరం.. 
రాష్ట్రంలో 8,703 మెగావాట్ల ఐదు జెన్‌కో ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి ప్లాంట్, ఎన్టీపీసీకి చెందిన 4,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 14,102 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి 870 కిలోల బొగ్గును వినియోగిస్తారు. కేంద్రం నిర్దేశించినట్టుగా ఏడు శాతం బయోమాస్‌ పెల్లెట్లు వినియోగించాలంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తికి 67 లక్షల టన్నుల పెల్లెట్లు అవసరమని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఎకరానికి 30 టన్నుల వెదురు వస్తే.. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్‌ వస్తాయని వెల్లడించాయి. 

ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం 
రాష్ట్రంలో సాధారణ వెదురు కాకుండా భీమా రకం వెదురుతో పెల్లెట్స్‌ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ రకం వెదురు ఎలాంటి నేలల్లోనైనా, సరిగా నీళ్లు లేకున్నా పెరుగుతుందని.. దానిని రెండేళ్లలోనే నరికి పెల్లెట్స్‌ తయారు చేయవచ్చని ఉద్యానశాఖ వర్గాలు చెప్తున్నాయి. చేలల్లో, గట్లమీద, బీడు భూముల్లో ఎక్కడైనా వేయొచ్చని అంటున్నాయి. మొదట్లో ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేసి నాటితే.. తర్వాత దాదాపు 50 ఏళ్లపాటు ఏటా ఆదాయం వస్తుందని అంటున్నాయి. వేసిన రెండేళ్ల నుంచే ఏటా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం హరితహారం కింద కోట్ల మొక్కలు నాటుతున్నారని.. ఆ స్థానంలో వెదురు వేస్తే అన్నివిధాలా ఉపయోగమని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు.  

భవిష్యత్తులో మరింత డిమాండ్‌.. 
ప్రస్తుతం ఏడు శాతం పెల్లెట్స్‌ను బొగ్గుతో కలిపి వినియోగించాలని కేంద్రం ఆదేశించినా.. 2030 నాటికి 20 శాతం కలపాలన్నది లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో వీటికి డిమాండ్‌ మరింతగా పెరుగుతుందని అంటున్నారు. పైగా వెదురు పెల్లెట్స్‌తో విద్యుత్‌ ధర కాస్త తగ్గుతుందని, కాలుష్యాన్నీ కొంత నివారించవచ్చని పేర్కొంటున్నారు. వెదురు చెట్లతో సాధారణ చెట్ల కంటే 33 శాతం మేర ఎక్కువ ఆక్సిజన్‌ వస్తుందని చెప్తున్నారు. 
 
రైతులకు అదనపు ఆదాయం 
దేశంలోనే మొదటిసారిగా వెదురు పెల్లెట్స్‌ పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టాం. ఇప్పటికే పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్‌టీపీసీ పరిశీలనకు పంపాం. వెదురు సాగుతో రైతుకు నిర్వహణ భారం లేకుండా ఏటా ఎకరానికి రూ. 2 లక్షల దాకా అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఒకవైపు ఆయిల్‌పాం, మరోవైపు వెదురు సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తాం. 
– వెంకట్రామ్‌రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు 

ఏమిటీ పెల్లెట్లు?
వృక్ష, జంతు పదార్థాలనే బయో మాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు,  చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నిం టిని పొడిచేసి.. మండే రసాయనాలు కలుపుతారు. తర్వాత అత్యంత వేడి, ఒత్తిడిని కలిగించే యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే బయోమాస్‌ పెల్లెట్స్‌ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్‌ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. అయితే రాష్ట్రంలో పూర్తి వెదురుతో పెల్లెట్లను తయారు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top