పాత పద్ధతిలోనే పంటల బీమా

Telangana government announces revival of crop insurance scheme - Sakshi

కొన్నేళ్లు ఫసల్‌ బీమాను అమలు చేసి ఆపేసిన గత సర్కారు 

రాష్ట్ర సర్కారు తరఫునే బీమా పథకం తెస్తామని ప్రకటన... సుమారు నాలుగేళ్లుగా ఎలాంటి పంటల బీమా లేని పరిస్థితి 

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేని దుస్థితి 

ఈ క్రమంలో తిరిగి ఫసల్‌ బీమా యోజన అమలుకు కొత్త సర్కారు నిర్ణయం 

వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి అమలు.. 

బీమా ప్రీమియం రేట్లను కట్టడి చేస్తేనే రైతులకు ప్రయోజనమనే అభిప్రాయాలు 

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ బెంగాల్‌ తరహాలో రాష్ట్రంలో సొంతంగా పంటల బీమా తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. కొన్నేళ్ల కింద రాష్ట్రంలో అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)నే తిరిగి అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనితో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందనుంది. నిజానికి 2020 వరకు రాష్ట్రంలో పీఎంఎఫ్‌బీవై అమలైంది. కానీ అప్పటి సర్కారు రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి బయటికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా అమల్లో లేదు. పంట దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఏదో ఒక పంటల బీమా పథకం ఉంటే మేలన్న భావన చాలా మంది రైతుల్లో నెలకొని ఉంది. 

పంటల బీమాతో ప్రయోజనం 
రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది బీమా చేయించేవారు. నేరుగా పంటల బీమా తీసుకోవడానికి రైతులు ముందుకు రావడంలేదని భావించిన సర్కారు.. బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు తప్పనిసరిగా పంటల బీమా చేయించే నిబంధన పెట్టింది. పంట రుణం ఇచ్చేప్పుడే బీమా ప్రీమియాన్ని మినహాయించుకొని మిగతా డబ్బులు రైతులకు ఇచ్చేవారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది.

2012–13లో 10 లక్షల మంది పంటల బీమా చేయగా.. పంట నష్టపోయిన 1.80 లక్షల మందికి రూ.78.86 కోట్ల పరిహారం అందింది. 2013–14లో 8.52 లక్షల మంది బీమా చేయించగా.. 1.18 లక్షల మందికి రూ.56.39 కోట్ల పరిహారం వచ్చింది. 2015–16లో 7.73 లక్షల మంది బీమా చేస్తే.. ఆ ఏడాది పంట నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. 

► 2016 వానాకాలం సీజన్‌ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం అ మల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొ మ్మును తమ వాటాగా భరిస్తాయి. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు ఫసల్‌ బీమా చేయించగా.. 1.34 లక్షల మందికి రూ.111.33 కోట్ల పరిహారం       వచ్చింది. ∙2018–19, 2019–20 సంవత్సరాల్లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరైనా.. అందులో కొంతమేర మాత్రమే రైతులకు దక్కింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రీమియం చెల్లించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. 

బీమా ప్రీమియంపై కట్టడి తప్పనిసరి 
పంటల బీమా వల్ల లాభం ఉన్నా.. చాలా మంది రైతులు బీమా ప్రీమియం విషయంలో అసంతృప్తితో ఉన్నారు. బీమా కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నా.. ప్రీమియం ధరలను పెంచుకుంటూ పోయాయని వాపోతున్నారు. తెలంగాణలో అప్పట్లో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్టుగా అమలైందని.. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శలు ఉన్నాయి. పీఎంఎఫ్‌బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం చొప్పున, పసుపు రైతులు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించారు.

ఇక పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతాన్ని రైతులు ప్రీమియంగా చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో హెక్టార్‌కు రూ.24,165 చొప్పున, మిరపకు ఏకంగా రూ.38,715 చొప్పున ప్రీమియంగా ఖరారు చేయడం గమనార్హం. అంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై తీవ్ర అసంతృప్తి చెందారు. తమకు పంటల బీమా వద్దని మొత్తుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమాను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో.. బీమా ప్రీమియంపై కట్టడి అవసరమని, ఆ దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top