వైవిధ్య సాగు..భలే బాగు! | Telangana: Farmers Farming Innovative Crops In Karimnagar District | Sakshi
Sakshi News home page

వైవిధ్య సాగు..భలే బాగు!

Nov 29 2021 1:58 AM | Updated on Nov 29 2021 8:56 AM

Telangana: Farmers Farming Innovative Crops In Karimnagar District - Sakshi

‘‘అదనులో చల్లితే.. పొదల్లో పడినా పంట ఎదుగుతుంది’’అన్నది పెద్దల మాట. అనుకూల వాతావరణం ఉన్నపుడు విత్తుకుంటే ఏ పంటైనా, ఎలాంటి నేలలోనైనా మంచి దిగుబడి ఇస్తుంది అన్నది దాని అర్థం. వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయం చేయడంతోపాటు, మార్కెట్‌కు అనుకూలమైన పంటలు ఎంచుకుని సాగు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదే ఆధునిక రైతు విజయరహస్యం. అందరితోపాటు సంప్రదాయ పంటలు వేయకుండా.. మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్న వాణిజ్య పంటలను సాగు చేస్తూ పలువురు ఔత్సాహికులు.. వరి రైతులకు భిన్నంగా లాభాలు ఆర్జిస్తున్నారు.


ఆపిల్‌ బేర్‌ పంట 

వినూత్న వంగడాలు, వైవిధ్య పంటలను సాగు చేసి నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వేసిన పంటలను తిరిగి వేయకుండా పంటల మార్పిడి అవలంబిస్తూ నేలసారం పెంపొందిచేలా యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి అరుదైన, డిమాండ్‌ ఉన్న పంటలను పండిస్తున్నారు. అలాంటి పంటలతో విజయాలు అందుకున్న కొందరు రైతుల విజయగాథలు ఇపుడు తెలుసుకుందాం!   
– సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

ఆపిల్‌ బేర్‌.. ఆదాయం జోర్‌
మూస ధోరణి పంటలకు స్వ స్తి పలికి మార్కెట్‌కు అనుగుణంగా ‘సాగు’తూ ఆదాయం గడిస్తున్నాడీ యువకుడు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన వైద తిరుపతి తనకున్న భూమిలో పత్తి, వరి పంట లు సాగు చేసేవారు. పనికి తగిన ప్రతిఫలం లేకపో గా పెట్టుబడిరాని పరిస్థితి. నేల వట్టిబారి ఎందుకూ కొరగాకుండా పోయింది. ఈ నేపథ్యంలో యూ ట్యూబ్‌లో ఆపిల్‌ బేర్‌ పండ్ల పంట తిరుపతిని ఆకర్షించింది.

అనుకున్నదే తడవుగా నారాయణపేట జి ల్లా నుంచి 350 మొక్కలు కొనుగోలు చేసి తన ఎక రన్నర భూమిలో నాటారు. ఈ మొక్క గరిష్ట జీవితకాలం 25 ఏళ్లు. ప్రతీ ఏటా ఆదాయమే. మొదటి సంవత్సరం లక్ష ఆదాయం రాగా క్రమేణా పెరుగుతుందని తిరుపతి ధీమాగా చెబుతున్నారు. 2017 లో మొక్కలు నాటగా ఈ సంవత్సరం రూ. 3 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు. మార్కెటింగ్‌ విషయంలోనూ  ఇబ్బంది ఎదురవలేదు. వ్యాపారులే పంట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.  

డిమాండ్‌ను బట్టి బుచ్చిరెడ్డి సాగు..
తిమ్మాపూర్‌ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల బుచ్చిరెడ్డి కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో రోజువారీ లాభం పొందుతున్నారు. ఆయనకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా మార్కెట్‌లో ఏయే నెలలో ఏ పంటకు డిమాండ్‌ ఉంటుందో గ్రహించిన బుచ్చిరెడ్డి అలాంటి కూరగాయలు పండిస్తున్నారు. రెండెకరాల్లో టమాట, వంకాయ, పచ్చి మిర్చి, కొత్తి మీర సాగు చేశారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే ఆవు పేడ, మూత్రంతో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు.

మాములుగా రెండెకరాలకు రూ.50వేల పెట్టుబడి అవసరమైతే.. సేంద్రియ పద్ధతిలో రూ.10 వేల ఖర్చు మాత్రమే ఉంటుంది. దీంతో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ. రోజూ 4 క్వింటాళ్ల వరకు కూరగాయలు విక్రయిస్తుండగా రూ.4 వేల ఆదాయం పొందుతున్నారు. బుచ్చిరెడ్డి ఆలోచనలో మార్పు.. ఆయనకు మంచి ఆదాయానికి మార్గం చూపింది.  

పంటల మార్పిడే విజయసూత్రం
కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈ రైతు పేరు పడాల వెంకటరాజం. మొత్తం 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకున్న భూమిలో ఒకసారి ఒక రకం పండించిన చోట రెండో దఫా అదే పంట సాగు చేయరు. ఎప్పటికప్పటిప్పుడు పంటలు మార్పిడి చేస్తూ.. ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తారు. వరి, మొక్కజొన్నతో పాటు అక్టోబర్‌లో మూడు నెలల్లో పండే మినుములు, జనవరిలో 15 రోజుల్లో చేతికివచ్చే నువ్వు పంట వేస్తారు.

మూడు నెలల విరామం తర్వాత మూడు నెలల్లో పండే మొక్కజొన్న పంటను ఎంచుకుంటారు. మినుములతో రూ. 1.1 లక్షలు, నువ్వులతో రూ.లక్ష, మొక్కజొన్నతో రెండెకరాలకు రూ. 1.2 లక్షలు చొప్పున లాభాలు పొందుతున్నారు. ఇలా వేసవికాలం మూడు నెలలు మినహాయిçస్తూ, పంటలు మారుస్తూ దాదాపు మూడెకరాలకే ఏటా రూ.3.5 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement