Telangana: కాపాడాల్సిన వారే హత్యలకు పాల్పడుతున్నారా? | Telangana Cops on the Path of Crime | Sakshi
Sakshi News home page

Telangana: కాపాడాల్సిన వారే హత్యలకు పాల్పడుతున్నారా?

May 8 2026 12:24 PM | Updated on May 8 2026 12:44 PM

Telangana Cops on the Path of Crime

సాక్షి, సిద్దిపేట: కొందరు పోలీసులు బెట్టింగ్‌లకు, చోరీలకు, హత్యలకు పాల్పడటం సర్వత్రా సంచలనంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు పలువురు బలవన్మరణం, హత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోద్దు.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టవద్దని చెప్పేవారే తప్పుదోవ పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనం. సిద్దిపేటకు చెందిన గౌటే ప్రవీణ్‌ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసై దాదాపు రూ.60లక్షలకుపైగా నష్టపోయారు. 

స్థిరాస్తి వ్యాపారి విశ్వనాథం.. బంధువు దగ్గర ప్రవీణ్‌ భూమిని తాకట్టు పెట్టి రూ.12లక్షల అప్పుగా ఇప్పించారు. డబ్బుల కోసం విశ్వనాథం ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 2న కారులో కానిస్టేబుల్‌ ప్రవీణ్, భార్య రజిత   కలిసి తీçసుకెళ్లారు. విశ్వనాథంను హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని.. మృతదేహాన్ని ఇమాంబాద్‌ వద్ద కాలువలో పడేశారు. ఇలా కానిస్టేబుల్‌ నేరానికి పాల్పడ్డాడు. ఇదే కానిస్టేబుల్‌ గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ఏమీ తెలియనట్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దొంగతనాల కేసు రికవరీలో సైతం చేతి వాటం ప్రదర్శించినట్లు సమాచారం. 

మరో కానిస్టేబుల్‌ బెట్టింగ్‌లకు పాల్పడి.. 
ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోవడంతో కానిస్టేబుల్‌ నరేశ్‌ తుపాకితో కుటుంబాన్ని మట్టుబెట్టడమే కాకుండా తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో 2024 డిసెంబర్‌ 15న భార్య ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ నరేశ్‌(35), చైతన్య(30), రేవంత్‌(6), రిషిత(5) ఈ ఘటనలో మరణించారు.

మరో ఘటనలో.. 
ఓ ప్రైవేట్‌ కంపెనీలో పలు విడతలలో రూ.25లక్షలు వరకు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో, అప్పులు ఇచి్చన వారితో గోడవలు జరగకుండా ఉండాలంటే మరణం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడు. దీంతో 2024 డిసెంబర్‌ 28 రాత్రి ఎలకల మందును టీలో కలుపుకుని ఇద్దరు పిల్లలతో పాటు భార్యభర్తలు తాగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. 29న ఉదయం చూసేసరికి అందరు స్పృహలోనే ఉండటంతో పాటు పక్కగదిలో రాజన్న సిరిసిల్ల 17వ బెటాలియన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బండారి బాలకృష్ణ(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది బతికి బయటపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement