Survey: కోవిడ్‌తో ధనికులు, పేదల నడుమ పెరిగిన అంతరాలు 

Study Report Highlights On Corona - Sakshi

గత ఏడాది లాక్‌డౌన్‌తో దేశంలో పదికోట్ల మంది ఉపాధి గల్లంతు 

ఉపాధి కోల్పోయినవారిలో ఎక్కువమంది యువత, మహిళలే.. 

జన్‌ధన్‌ కంటే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే ఎక్కువమందికి లబ్ధి 

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉధృతి ప్రభావం 

గతం కంటే ఎక్కువుండే చాన్స్‌ 

కరోనా పేదల జీవితాల్లో కల్లోలం రేపింది. వారి బతుకులను ఆగమాగం చేసింది. కరోనా కట్టడికిగాను గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వారిని అగాధంలోకి నెట్టింది. దీని మూలంగా పేదలు, ధనికుల నడుమ సామాజిక, ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయి. లాక్‌డౌన్, తదనంతర పరిస్థితులపై అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఇటీవల ’కోవిడ్‌ 19– జీవన ప్రమాణాలు’అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఇలాంటి అంశాలు వెల్లడయ్యాయి.

తాజాగా విడుదలైన ఈ సర్వే నివేదిక ప్రకారం.. కరోనా సంక్షోభంతో దేశంలో శ్రామికవర్గం ఆదా యం గణనీయంగా తగ్గడంతో అకస్మాత్తుగా పేదరికం పెరిగింది. లాక్‌డౌన్‌ వలన దేశవ్యాప్తంగా పది కోట్లమంది ఉపాధి కోల్పోగా, 2020 జూన్‌ చివరి నాటికి సుమారు కోటిన్నర మంది గతంలో తాము చేసిన పనులకు దూరంగా ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు 2020 జనవరి నాటికి కుటుంబ తలసరి ఆదాయం సగటున రూ.5,989 ఉండగా, అక్టోబర్‌ నాటికి రూ.4,979కి పడిపోయింది. లాక్‌డౌన్‌ మూలంగా ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించి చాలామంది ఆదాయాన్ని కోల్పోయారు.    
– సాక్షి, హైదరాబాద్‌

యువత, మహిళలపైనే ఎక్కువ ప్రభావం  
భద్రత ఉన్న ఉద్యోగాలను కోల్పోయిన వారిలో మహిళలతోపాటు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌కు ముందు క్రమం తప్పకుండా వేతనాలు పొందిన వారిలో సగం మంది ఆ తర్వాత అసంఘటిత రంగంలో చేరారు. లాక్‌డౌన్‌కు ముందు ఉద్యోగ భద్రతతోపాటు క్రమం తప్పకుండా వేతనాలు పొందినవారిలో 30 శాతం మంది లాక్‌డౌన్‌ తర్వాత స్వయం ఉపాధి వెతుక్కోగా, మరో 9 శాతం మంది నామమాత్ర వేతనం లభించే ఉద్యోగాల్లో చేరారు.  

పూర్తిగా ఆదాయం కోల్పోయిన పేదలు 
గత ఏడాది ఏప్రిల్, మే నెలలో 20 శాతం నిరుపేదలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారు. గత ఏడాది మార్చి నుంచి అక్టోబర్‌ వరకు ఎనిమిది నెలల కాలంలో మధ్య తరగతివారు రెండు నెలల వేతనం నష్టపోగా, ధనికులు తమ ఆదాయంలో పావు వంతును కోల్పోయారు. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే కనీస వేతనాలు (రోజుకు రూ.375) కంటే తక్కువగా పొందే వారి సంఖ్య లాక్‌డౌన్‌ తర్వాత 23 కోట్లకు చేరింది. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం పేదరికం పెరిగేందుకు దారి తీశాయి.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే లబ్ధి.. 
లాక్‌డౌన్‌ సమయంలో జన్‌ధన్‌ ఖాతాల కంటే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే ఎక్కువ మందికి లబ్ధి జరిగింది. 90% కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, 50% కుటుంబాల్లోని మహిళల పేరు మీద మాత్రమే జన్‌ధన్‌ ఖాతాలున్నాయి. లాక్‌డౌన్‌ లో వీరిలో 77% కుటుంబాలకు పీడీఎస్‌ బియ్యం, 49% కుటుంబాలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా నగదు బదిలీ జరిగింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ నివేదిక సూచిం చింది. 2021 జూన్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ, ఈజీఎస్‌ పనిదినాలు 150 రోజులకు పెంపు, ఈజీ ఎస్‌ వేతనాల పెంపు, వృద్ధాప్య పింఛన్లలో కేంద్రం వాటా రూ.500కు పెంపు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు 6 నెలలకు  అదనంగా రూ. 30 వేలు చెల్లింపు వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. 

అధ్యయన నివేదిక ప్రధానాంశాలు.. 

  • 66% మంది లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయారు.
  • 64% మంది ఆదాయాల్లో మార్పు చోటుచేసుకుంది..
  • 77% కుటుంబాలు గతంలో కంటే తిండిపై చేసే ఖర్చును తగ్గించాయి.. 
  • 47%  కుటుంబాలకు వారానికి సరిపడా సరుకులు కొనే శక్తి లేదు..
  • 87% పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేవారు, లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయారు
  • 88% పట్టణ ప్రాంత కుటుంబాలకు తరువాతి నెల అద్దె చెల్లించే పరిస్థితి లేదు...
  • 81% వలస కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయారు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top