‘మల్లన్న’ చెంతకు గోదారి

State Government Getting Ready Godavari Water Into Mallannasagar Reservoir - Sakshi

ఈ నెల 18 లేదా 20న మోటార్లు ఆన్‌ 

తుక్కాపూర్‌ వద్ద ఎత్తిపోతలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

96 శాతానికి పైగా మల్లన్నసాగర్‌ పనులు ఇప్పటికే పూర్తి 

ఈ ఏడాది 10 టీఎంసీల నిల్వ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్‌ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది.  

రంగనాయక్‌సాగర్‌ టు మల్లన్నసాగర్‌ 
రిజర్వాయర్‌ను ఈ ఏడాది జూన్‌ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్‌డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్‌సాగర్‌లోని నీటిని తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్‌సాగర్‌లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్‌మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్‌ నింపనున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి.  

అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. 

ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది.  

కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు.  

ఈ రిజర్వాయర్‌ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్‌–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి.  

మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది.  

ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు.  

ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి.  

మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్‌కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్‌ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top