మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు

Special Story On Tribal Leader Ramji Gond - Sakshi

చరిత్ర పుటల్లో వెయ్యి ఉరులమర్రికి చోటేది?

ముందుతరాలకు మా త్యాగం తెలియనివ్వరూ.. 

సెప్టెంబర్‌ 17 నేపథ్యంలో నిర్మల్‌ గడ్డపై ‘రాంజీగోండు గోస’ 

‘సెప్టెంబర్‌ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్‌గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా?

కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్‌ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. 

నిర్మల్‌: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్‌ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్‌ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది.

గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్‌వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు.

అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్‌) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్‌ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్‌.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. 

రోహిల్లాల తోడుతో.. 
ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్‌ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్‌ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు.

నిర్మల్‌ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్‌ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్‌ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్‌ ద్వారా హైదరాబాద్‌ రాజ్యంలో వారి రెసిడెంట్‌ అయిన డేవిడ్‌సన్, నాటి పాలకుడు అఫ్జల్‌ ఉద్‌దౌలా వరకు తెలిసింది. 

అణచివేత కోసం బళ్లారి దళం.. 
ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్‌ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్‌ ఇన్‌ఫ్రాంట్రీని నిర్మల్‌ రప్పించారు. కల్నల్‌ రాబర్ట్‌ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్‌ సఫలమయ్యాడు. సోన్‌–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. 

ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. 
దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్‌ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్‌ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్‌ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. 

నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. 
ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్‌ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top