మునుగోడు కోసమే ‘విమోచన’

Hyderabad Liberation Day History, Facts, Munugode Bypoll - Sakshi

తెలంగాణలో సెప్టెంబర్‌ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్‌ జాహీ వంశస్థులు మొఘల్‌ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్‌ సబ్సిడియరీ అలయెన్స్‌’ పేరిట, 1800లో బ్రిటిష్‌ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. 

తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్‌ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్‌ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్‌ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్‌ తన పుస్తకంలో రాశారు. 

నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్‌ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్‌ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. 

నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్‌లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్‌ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్‌ఎస్‌ అంటే ఏంది?)

ఈ ఏడాది సెప్టెంబర్‌ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్‌. ప్రజలు గమనించకుండా ఉంటారా!

– సీహెచ్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి
ఎఫ్‌ఐటీయూ ప్రధాన కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top