‘కరోనా’ దోపిడీ

Private Labs Loots Money In Name Of Corona Diagnostic Tests In Telangana - Sakshi

ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌కు రూ.250.. 

పరీక్షకు రూ.2,800పైనే వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ల్యాబ్‌లు

కేంద్రం రూ.950గా ఫీజు నిర్ణయించినా పట్టించుకోని వైనం

ర్యాపిడ్‌ కిట్‌ ధర రూ.275.. రూ.2 వేలకుపైగా గుంజుడు

పీపీఈ కిట్లు, రెమిడెసివిర్‌ విషయంలోనూ అదే దోపిడీ

రూ.13కే ఎన్‌–95 మాస్క్‌.. కానీ రూ.250గా బిల్లు 

చోద్యం చూస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్‌ ల్యాబ్‌లు బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధరల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా, తెలంగాణలో మాత్రం తగ్గిన ధరలు అమలు కావట్లేదు. ఆ మేరకు తక్కువ వసూలు చేయాలన్న ఆదేశాలనూ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఇవ్వలేదు. ఇదే అదనుగా ప్రైవేట్‌ లేబొరేటరీలు తక్కువ ధరకు కిట్లను కొని ఎక్కువ ధరకు టెస్టులు చేస్తుండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసినందుకు రూ. 3 వేలపైనే వసూలు చేస్తున్నారు. మరోవైపు పీపీఈ కిట్ల ధరలను కూడా అధికంగా వేస్తూ లేబరేటరీలు సహా ఆసుపత్రులు బాధితుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అలాగే కరోనా రోగులు వాడే రెమిడెసివీర్‌ ఇంజక్షన్‌ ధర కూడా మార్కెట్లో తగ్గినా, పాత ధరనే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు.

ప్రైవేట్‌లో 50చోట్ల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 చోట్ల, ప్రైవేట్‌ లేబొరేటరీల్లో 50 చోట్ల ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 1,200 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే దాన్ని పాజిటివ్‌గానే పరిగణిస్తారు. అందులో నెగెటివ్‌ వచ్చి, కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌ట్‌పీసీఆర్‌ పరీక్ష చేయాలన్నది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిబంధన. దీంతో ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి లక్షణాలున్నవారు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు బాధితులు ప్రైవేట్‌ లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్‌ లేబరేటరీల్లో రోజూ 2,500 నుంచి 3 వేల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు.

90 శాతం ధరలు తగ్గినా.. తగ్గని దోపిడీ
కరోనా విజృంభించిన కొత్తలో ఒక్కో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు రూ.2,500 ఖర్చయ్యేది. దేశంలో రెండు మూడు కంపెనీలే కరోనా నిర్ధారణ కిట్లను తయారుచేయడం, డిమాండ్‌ ఎక్కువుండటంతో కిట్ల ధరలు ఆ స్థాయిలో ఉండేవి. పైగా చాలా తక్కువచోట్ల పరీక్షలు జరిగేవి. తెలంగాణలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కోసం మొదట్లో పుణేకు కారులో శాంపిళ్లను పంపించేవారు. తర్వాత గాంధీ వైరాలజీ లేబొరేటరీల్లో కరోనా పరీక్షలు మొదలయ్యాయి. ఆపై ప్రభుత్వం ప్రైవేట్ల లేబ్‌ల్లోనూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు అనుమతిచ్చింది. అప్పటికి కిట్ల ధరలు కాస్తంత తగ్గడంతో ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు ప్రభుత్వం రూ.2,200 ధర నిర్ధారించింది.

ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లి టెస్ట్‌చేస్తే రూ.2,800 వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అయినా కొన్ని లేబ్‌లు పీపీఈ కిట్‌ ధరను కూడా కలిపి రూ.4 వేల వరకు వసూలు చేసేవి. ప్రస్తుతం కూడా రూ.3,500 వరకు వసూలు చేస్తున్న లేబొరేటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను దేశంలో దాదాపు 180 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అవన్నీ పోటీపడి బిడ్లు వేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కిట్ల ధర రూ.250కి పడిపోయిందని వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అంటే ఒకప్పుడు సుమారు రూ.2,500 ఉన్న కిట్‌ ధర, ఇప్పుడు రూ.250కి పడిపోయింది. అంటే 90 శాతం మేర కిట్ల ధరలు తగ్గాయన్నమాట.

దీంతో కేంద్రం గతంలో రూ.2,200 ఉన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ఫీజును రూ.950కి తగ్గించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రైవేట్‌ లేబొరేటరీలు రూ.2,800 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నాయి. అంతేగాక ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌ ధర ఒకప్పుడు రూ.504 వరకు ఉండగా, ఇప్పుడు రూ.275కు తగ్గింది. కానీ అనుమతి లేకున్నా కొన్ని ప్రైవేట్‌ లేబొరేటరీలు ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తూ రూ.2 వేలపైనే వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కిమ్మనడం లేదు.

రెమిడెసివీర్‌ ధర వెయ్యి తగ్గుదల
ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగులకు వైరస్‌ తీవ్రతను బట్టి రెమిడెసివీర్‌ ఇంజక్షన్‌ ఇస్తారు. గతంలో దీని ధర రూ.3 వేలు ఉండగా, ఇప్పుడది రూ.2 వేలకు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని ఆసుపత్రులు మాత్రం పాత ధర కాదు కదా రూ.4 వేలకు మించి వసూలు చేస్తున్నాయని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతెందుకు పీపీఈ కిట్‌ ధర మొదట్లో రూ.600 వరకు ఉండేది. ఇప్పుడది రూ.250 నుంచి రూ.300 మధ్యకే దొరుకుతుంది. కానీ ఆసుపత్రులు మాత్రం రూ.600 నుంచి రూ.1,000 వరకు పీపీఈ కిట్‌ ధర ఫీజులో కలిపి బిల్లు వేస్తున్నాయి.

ఇక రూ.200 – రూ.250 ఉండే ఎన్‌–95 మాస్క్‌ ధర ఇప్పుడు రూ.13కి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రుల్లో రూ.250 వరకు ఫీజులో కలిపి చూపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ లేబొరేటరీల్లో సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేసినప్పుడు బాధితులు తప్పనిసరిగా ఎన్‌–95 మాస్క్‌ ధరించాల్సిందేనంటూ రూ.250 వసూలు చేస్తున్నాయి. ఇక త్రీలేయర్‌ సర్జికల్‌ మాస్క్‌ ధర గతంలో రూ.8 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇప్పుడు వాటి ధర 80 పైసలకు పడిపోయింది. అయినా ప్రైవేట్‌ ఆసుపత్రులు, లేబొరేటరీలు మాత్రం పాత ధరలనే వసూలు చేస్తూ కరోనా బాధితుల్ని పిండేస్తున్నాయి.

ఔను.. కిట్ల ధరలు తగ్గాయి
కరోనా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గాయి. ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌ ధర రూ.250కి, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్ల ధర రూ.275కి తగ్గింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా చేస్తున్నందున తగ్గిన ధరల ప్రకారమే కిట్లను కొనుగోలు చేస్తాం. దీనివల్ల ప్రభుత్వం కిట్లకు అధికంగా సొమ్ము కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక రెమిడిసివీర్‌ ఔషధం, ఎన్‌–95 మాస్క్‌లు, సర్జికల్‌ మాస్క్‌ల ధరలు భారీగా తగ్గాయి. 
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top