కలవరపెడుతున్న కడుపు ‘కోత’లు 

Private Hospitals Opting For Unnecessary C Section Births For financial Benefits - Sakshi

గ్రేటర్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం

డబ్బులు గుంజడమే ప్రధాన ధ్యేయం

 సహజ కాన్పులకు అవకాశమున్నా దాటవేత ధోరణి

ఎక్కువ శాతం సిజేరియన్లు వీటిలోనే..

నగరంలో కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. ధన సంపాదనే లక్ష్యంగా పలు ప్రైవేటు గైనకాలజిస్టులు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ శాతం సిజేరియన్లు జరుగుతుండటంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యింది.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు కార్పొరేట్, ప్రవేటు నర్సింగ్‌ హోంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సంపాదనే లక్ష్యంగా తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే.. సిజేరియన్‌ ప్రసవాలకు పట్టే సమయం కూడా చాలా తక్కువ. సర్జరీ చేయడం వల్ల ఆస్పత్రికి ఆదాయం సమకూరుతుంది. ఈ రెండు అంశాలు గైనకాలజిస్టులకు కలిసి వచ్చే అంశాలు. సిజేరియన్‌ ప్రసవాలు ఆ తర్వాత తరచూ కడుపు నొప్పి, ఇన్‌ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌లో 98.3 శాతం ప్రసవాలు ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నప్పటికీ మొత్తం ప్రసవాల్లో 59.7 శాతం సిజేరియన్లు ఉండగా.. వీటిలో ఎక్కువ శాతం సిజేరియన్‌ డెలివరీలు ప్రైవేటులోనే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు 

సోమ, శుక్రవారాల్లోనే అధికం.. 
కాన్పు కోతలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆరోగ్యబీమా ఉన్న వారు ఎక్కువగా ఈ ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు. కాన్పుకోతలు సోమ, శుక్రవారాల్లోనే అత్యధికంగా జరుగుతుండటం విశేషం. చాలా మంది ఈ రెండు రోజులను శుభసూచకంగా భావిస్తుంటారు. అంతేకాదు ప్రసవానికి ముందే వార, తిథి, నక్షత్ర బలాలను బట్టి ముహూర్తాలు ఖరారు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. ఆదివారం ప్రసవాల సంఖ్య మాత్రమే కాదు సిజేరియన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యులకు ఆ రోజు సెలవు కావడమే.  
కారణాలనేకం..    
♦ ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ గర్భిణుల్లో ఆందోళన మొదలవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తొలి ప్రసవం సిజేరియన్‌ అయితే ఆ తర్వాతి ప్రసవానికీ సర్జరీకే ప్రాధాన్యమిస్తున్నారు. 
♦ సంతాన సాఫల్య శాతం తగ్గిపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. మరికొన్ని కేసుల్లో మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకొని 35 ఏళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిస్తున్నారు. ఇలాంటి కేసులను అరుదుగా పరిగణిస్తున్న వైద్యులు తప్పనిసరిగా చికిత్సలకు వెళుతున్నారు.  
♦ కొందరు మహిళలు తొలి కాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళుతున్నారు. చాలా మంది మహిళలు ఆ నిర్ణయాన్ని వైద్యులకే వదిలేస్తున్నారు. సహజ కాన్పుల సమయంలో పారామెడికల్‌ సిబ్బంది చేసే వెకిలి వ్యాఖ్యలు, ఇతరత్రా భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. సిజేరియన్‌కే వెళ్లడం మంచిదని తోటి మహిళలకు చెబుతుండటం కూడా సిజేరియన్లు పెరగడానికి కారణమవుతోంది.  

గర్భం దాల్చిన తర్వాత పరీక్షలకు వస్తున్న వారు ఇలా.. శాతాల్లో 
తొలి యాంటినెంటల్‌ చెకప్‌కు హాజరువుతున్న వారు  87.9
కనీసం నాలుగు వారాల పాటు చెకప్‌కు వస్తున్నవారు 69.9
మొదటి, రెండో కాన్పుకు మధ్య కనీస వ్యతాసం పాటిస్తున్న వారు 89.6
వంద రోజుల పాటు ఐరెన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడుతున్నవారు 72.2
180 రోజుల పాటు వాడుతున్నవారు 38.4
ఎంసీపీ కార్డు పొందుతున్న వారు  94.4  

సిజేరియన్లతో ఆరోగ్య సమస్యలు  
సిజేరియన్‌తో పురిటినొప్పుల బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ.. దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సిజేరియన్‌తో అధిక రక్తస్రావంతో పాటు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కత్తిగాటు గాయం మానడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత నెలసరి సమస్యలు తలెత్తి అధిక బరువు సమస్య ఉత్పన్నమవుతుంది. కోత, కుట్ల వద్ద ఇన్‌ఫెక్షన్‌ సమస్య తలెత్తుతుంది. సాధ్యమైనంత వరకు సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.      
– డాక్టర్‌ సంగీత, గైనకాలజిస్ట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top