హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..

Precautions To Be Taken In Winter Season By Exports - Sakshi

చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. చలిలో సైతం కొందరు మైదానాల్లో జాగింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం. 

ఆస్తమా, అలర్జీ ప్రమాదంపొంచి ఉంది
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎప్పుడూ వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరే తాగాలి. చలికి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దాని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా రోగులు ఆయాసానికి గురి కాకుండా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నందున వృద్ధులు, పిల్లలు, గర్భిణులు అసలే బయటికి రావద్దు. రెండు రోజులకు మించి దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
– డాక్టర్‌ రవిప్రసాద్, ఎండీ, పలమనాలజిస్టు , నల్లగొండ 
చదవండి: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల

చర్మ వ్యాధులు ఉన్నవారు చలికాలం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చర్మం పొడిబారి పోతుంది. చర్మ వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. ఈసారి చలి మరింత ఎక్కువగా ఉన్నందున సోరియాసిస్‌ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సోరియాసిస్‌ వ్యాధి చలికి తీవ్రమవుతుంది. ఒల్లంతా పొలుసుల మాదిరిగా  మారుతుంది. శరీరంలో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైతే శరీరం, కాళ్లు పగిలినట్లు అవుతాయి. పెద్ద వయస్సువారు, పుట్టుకతోనే పొడి చర్మం ఉండేవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. పెదాలు, కాళ్లు కూడా పగులుతుంటాయి. కొందరిలో చలికి తల వెంట్రుకలు రాలిపోతుంటాయి. గాయాలైనా కూడా మానని పరిస్థితి. దురద కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మవ్యాధి పెరిగి కొందరిలో శరీరం, కాళ్లు, పగిలిపోతాయి. అలాంటివారు వైద్యులను సంప్రదించాలి. 
చదవండి: 2021 గుణపాఠాలు.. ఇప్పుడైనా కొత్త నిర్ణయాలు తీసుకుందామా..

చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె మంచిది చలికాలం ఆయిల్‌ శాతం ఎక్కువగా ఉన్న సబ్బులను వాడాలి. గ్లిజరిన్‌తో తయారు చేసిన సబ్బులను వాడడం వల్ల చర్మం వాడిపోకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మ్యాయిశ్చరైజ్‌ క్రీమ్‌లను వాడుకోవాలి. అవి కొనుగోలు చేయలేనివారు కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఫ్యారాఫిన్‌ నూనె కూడా తక్కువ ధరలో ఉంటుంది. దాన్ని కూడా వాడొచ్చు. చలికాలం నీరు తక్కువగా తాగుతారు. దానివల్లన చర్మం పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిట్కాలతో, ఎప్పటికప్పుడు ఆయిల్‌తో మాయిశ్చరైజ్‌ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
– డాక్టర్‌ అనితారాణి, చర్మవ్యాధుల వైద్య నిపుణులు,   నల్లగొండ
చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్‌ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి

నీరు ఎక్కువ తాగాలి.. బయటి పదార్థాలు తినొద్దు
వారం రోజులుగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నపిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. పెద్దలతో పోల్చితే చిన్నపిల్లల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల చలి కాలంలో పిల్లలను వెచ్చని ప్రదేశాల్లోనే  ఉంచాలి. నెలలోపు పిల్లలకు చలిగాలి తగలకుండా దుప్పట్లు కప్పి ఉంచాలి. గదుల్లో ఫ్యాన్‌లు, ఏసీలు వేయొద్దు. నెలలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ సాక్సులు, గ్లౌజ్‌లు, స్వెర్టర్లు వేయాలి. సంవత్సరం దాటిన పిల్లలకు కూడా స్వెర్టర్లు వేసి ఉంచాలి. చిన్నారుల చర్మం పొడి బారిపోకుండా మెత్తగా ఉంచుకునేలా క్రీమ్స్‌
రాయాలి. చల్లటి గాలికి జలుబు, దగ్గు వస్తుంది. పిల్లలను బయటికు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలపై తిప్పకపోవడమే మంచిది. ఎదిగిన పిల్లలకు మాస్క్‌ వాడాలి. పిల్లలకు వేడివేడిగా ఆహార పదార్థాలు పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగించాలి. ఈ కాలంలో బయటి ఆహార పదార్థాలు తినకూడదు. శీతల పానియాలు తాపొద్దు. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్‌ తినకుండా చూడాలి. 
–డాక్టర్‌ తేజావత్‌ విద్యాసాగర్‌ , సూర్యాపేట 

‘షుగర్‌’ బాధితులూ.. జర జాగ్రత్త
గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల వరకు పడిపోతున్నాయి. చలి కాలంలో షుగర్‌ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చలికి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రావొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాస్కు ధరించడంతోపాటు తగు జాగ్రతలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగుతూ వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. చలికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండు రోజులు అవి తగ్గకపోతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఒమిక్రాన్‌కు కూడా ఇవే లక్షణాలతోపాటు ఒల్లు  నొప్పులు ఉంటున్నాయి. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పటి వరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటే మంచిది. షుగర్‌ వ్యాధికి, కీళ్ల నొప్పులు, స్టెరాయిడ్స్‌ వాడేవారు మరింత జాగ్రతగా ఉండాలి. ఈ రెండు నెలలపాటు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చలి కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పుదు. 
– డాక్టర్‌ విజయ్‌కుమార్, జనరల్‌ ఫిజీషియన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నల్లగొండ మెడికల్‌ కాలేజీ

వ్యాయామం మరువొద్దు
రామగిరి(నల్లగొండ) : చలికాలం వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో వ్యాధిగ్రస్తుల్లో రక్త చిక్కబడే ప్రమాదం ఉంటుంది. దీంతో వారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తుంటారు. ఈ కాలంలో మైదానాలన్నీ మార్నింగ్‌ వాకర్స్‌తో కిటకిటలాడుతుంటాయి. చిన్నా పెద్ద అని తారతమ్యం లేకుండా వృద్ధులు సైతం వ్యాయామం చేయాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top