 
													సాక్షి, హైదరాబాద్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. కానీ.. పక్షం రోజులుగా పొడి వాతావరణం, ఎండలు మండుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిరుజల్లులు, మబ్బులతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు తట్టుకోలేక సిటీజనులు అల్లాడిపోతున్నారు.

ఉపశమనం కోసం మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆన్ చేస్తున్నారు. దీంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అన్యూహ్యంగా పెరిగింది. వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ సగటు విద్యుత్ డిమాండ్ 52–55 మిలియన్ యూనిట్లుగా ఉండగా, తాజాగా 61 ఎంయూలకు పైగా నమోదవుతుండటం విశేషం. ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం రెట్టింపవడంతో మీటర్లు గిర్రున తిరుగుతూ స్లాబ్‌రేట్లు మారి భారీగా బిల్లులు చేతికి అందుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

హీటెక్కుతున్న పీటీఆర్‌లు 
ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడం, పగటి ఉష్ణోత్రలు కూడా భారీగా నమోదవుతుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతుండటంతో సరఫరాలో అంతరాయం తప్పడంలేదు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడం, బహుళ అంతస్తుల సముదాయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచినీటి మోటార్లు, లిఫ్ట్‌లు పని చేయకపోవడంతో మీటర్ రీడింగ్ నమోదు, బిల్లుల జారీ కోసం ఆయా నివాసాలకు వెళ్లిన సిబ్బంది ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తోంది. 

ఈ సీజన్‌లో అత్యధికం 
విద్యుత్ వినియోగం సాధారణంగా వేసవిలో మాత్రమే 60 ఎంయూలు దాటుతుంది. వర్షాకాలం, చలికాలంలో చాలా తక్కువ వాడకం నమోదవుతుంది. కానీ ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత రెండు రోజుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ఇదే రోజు 2392 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా తాజాగా శుక్రవారం 2984, శనివారం 2998 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో డెంగీ కారక దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు 
లేకుండా చేస్తున్నాయి.  
ఆకస్మిక విరామం వల్లే
శుక్రవారం నగరంలో 32.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా,  శనివారం 34 డిగ్రీలకు చేరింది. రుతుపవనాల మధ్య విరామమే ఆకస్మిక ఉక్కపోతకు కారణం. ప్రస్తుతం వర్షాకాలమే అయినా రుతుపవనాలు బలహీన పడటం వల్ల  అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల అధిక ఉక్కపోత నమోదవుతోంది. రుతుపవనాల మధ్యలో ఆకస్మిక విరామం వస్తే ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుంది.  
– కె. నాగరత్న, ఐఎండీ డైరెక్టర్  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
