సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి
రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు
జన సమీకరణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలమునకలు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీ నుంచి రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించడంతోపాటు మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ సమీకరణ ద్వారా సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డి సన్నాహాల్లో తలమునకలైంది.
అంచనాలకు మించి జనసమీకరణ, ప్రజలు, కార్యకర్తల హాజరు ద్వారా మోదీ సభను విజయవంతం చేసి సత్తా చాటాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని (ఒకటి మిత్రపక్షంతో కలిసి) బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పార్టీపరంగా రాజకీయ అంశాలపై మోదీ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ...
మధ్యాహ్నం 2:20 గంటలకు కర్ణాటక నుంచి బేగంపేట విమానాశ్రయానికి రాక.
3 నుంచి 3:30 గంటల మధ్య గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
3:45–4:15 గంటల మధ్య హైటెక్ సిటీ సమీపంలో సింధు హాస్పటల్ ప్రారంభోత్సవం. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పరామర్శ.
సాయంత్రం 4:45 నుంచి 6:15 గంటల మధ్య బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రిజర్వ్ టైమ్.
6:30 నుంచి 7:10 గంటల మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం.
రాత్రి 7:20 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనం.
ప్రధాని ప్రారంభించే/శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
⇒ హైదరాబాద్–పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గుడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రూ. 3,175 కోట్ల ఖర్చుతో ఎన్‌హెచ్–167 ఫోర్ లేనింగ్ పనులకు శంకుస్థాపన. దీనిద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది.
⇒ సంగారెడ్డి జిల్లాలో రూ. 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 3,245 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్–65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
⇒ వరంగల్‌లో పీఎం మిత్ర పథకం కింద రూ. 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే పూర్తిస్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్క్‌గా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వ ఫైవ్–ఎఫ్ విజన్‌లో భాగంగా ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్‌గా పనిచేయనుంది. ప్రతిపాదిత నాగపూర్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్‌్కప్రెస్ హైవే (ఎన్‌హేచ్–163 జీ)కి సమీపంలో మేజర్ రైల్వే నెట్‌వర్క్స్, సీ–పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది.
⇒ జాతీయ స్థాయిలో ముఖ్యమైన రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట–విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో పలు సెక్షన్లను కవర్ (118 కి.మీ) చేయనున్నాయి. రద్దీగా ఉండే గ్రాండ్‌ట్రంక్ కారిడార్‌లో లైన్ కెపాసిటీని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. దీని ద్వారా వేగవంతమైన రైళ్ల కార్యకటాపాలు, సమయపాలన మెరుగదల, సరుకు రవాణా వేగవంతానికి దోహదపడనుంది. ఈ సందర్భంగా కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట జంక్షన్‌లో సాఫీగా రవాణా సాగేలా దోహదపడటంతోపాటు హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు వేగంగా సాగేలా సహాయపడనుంది.
⇒ హైదరాబాద్ శివార్లలోని మల్కాపూర్‌లో రూ. 600 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండియన్ అయిల్ టెర్మినల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.
⇒ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1,500 పడకల ‘సింధు కేన్సర్ హాస్పిటల్’ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. లాభాపేక్ష లేని సంస్థ ద్వారా కేన్సర్ చికిత్స కేంద్రీకృతంగా మల్టీ–సూపర్ స్పెషాలిటీ క్వార్టర్నరీ కేర్‌ను అందించనున్నారు.


