లక్ష్యం.. 2 లక్షలు | PM Modi PublMeeting in Secunderabad on May 10: BJP Preparatory to Meet in telangana | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. 2 లక్షలు

May 9 2026 3:54 AM | Updated on May 9 2026 3:54 AM

PM Modi PublMeeting in Secunderabad on May 10: BJP Preparatory to Meet in telangana

పరేడ్‌ గ్రౌండ్స్‌ మార్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీలు

భారీ జనసమీకరణకు బీజేపీ కసరత్తు..

రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలను ప్రధాని మోదీ సభకు రప్పించేందుకు ఏర్పాట్లు 

ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు 

రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, డీకే అరుణల నిత్య పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వ హించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణతో మోదీ సభ విజయవంతానికి కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ముందస్తు సన్నాహాలు, ఏర్పాట్లలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌ మోదీ సభ కోసం అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, జిల్లా స్థాయి నాయకులను ఇన్‌చార్జ్‌లుగా (ఒక్కో జిల్లాకు పార్టీ నుంచి ఒకరు, ప్రజాప్రతినిధి ఒకరు) నియమించారు.

ఏ జిల్లాకు ఆ జిల్లా నుంచి పార్టీ కేడర్, ప్రజలను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతంలో హైదరాబాద్‌/సికింద్రాబాద్‌లలో మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాల సభ నిర్వహిస్తే చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచే సమీకరణకు పరిమితమయ్యేవారు. అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర పార్టీ  యావత్‌ యంత్రాంగం ఇందులో నిమగ్నమైంది.

జనసమీకరణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు మొదలుకొని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు, అర్వింద్‌ ధర్మపురి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, పైడి రాకేశ్‌రెడ్డి,, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పరేడ్‌ గ్రౌండ్స్‌ను సందర్శించిన రాంచందర్‌రావు అక్కడ సాగుతున్న సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు.   

తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు: బండి సంజయ్‌  
చిక్కడపల్లి: ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉండి.. ప్రత్యే కంగా నిధులు ఇస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సభను జయప్రదం చేయాలని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి చేపట్టిన బైక్‌ ర్యాలీని ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృదిŠధ్‌ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాల్సిందేనన్నారు. ఈ ర్యాలీలో సికింద్రాబాద్‌ జిల్లా మహకాళి జిల్లా అధ్యక్షుడు జి.భారత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement