ఎమ్మెల్యేల కేసులో భారీ ట్విస్ట్‌.. నందకుమార్‌పై రోహిత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Pilot Rohith Reddy Sensational Comments On MLAs Poaching Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారిస్తోంది. కాగా, విచారణ అనంతరం.. రోహిత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరించాను. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నందకుమార్‌ ద్వారా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూశారు. ఇప్పుడు నందకుమార్‌ను విచారిస్తామని అంటున్నారు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకే ఈడీ విచారణ జరిపింది. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా నాకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. దీంతో, బీజేపీ జాతీయ నేతల బండారం బయటపడింది. 

మొదటి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించినా ఈ కేసు గురించి ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు గురించి రెండో రోజు ప్రశ్నించారు. అది కూడా నేను అడిగితే చెప్పారు. కంప్లైంట్‌ చేసిన నన్ను విచారించారు తప్ప.. నిందితులను ఎందుకు ప్రశ్నించడంలేదు?. నంద కుమార్‌ ద్వారా మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నారు. నందకుమార్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ తారుమారు చేయబోతున్నారు. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడుతోంది. 

ప్రజలు తన్నుకు చావాలన్నదే బీజేపీ విధానం. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నేను గులాబీ సైనికుడిగా బీజేపీ కుట్రలను తిప్పికొడతాను. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ కొత్త కుట్రలను మేము భగ్నం చేస్తాము. ఈడీ నోటీసుల మీద రేపు హైకోర్టులో రిట్‌ వేయబోతున్నాను. బీజేపీ అగ్ర నేతలు ఎందుకు విచారణకు రావడంలేదు. నాకు, నందకుమార్‌కు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top