ఆన్‌లైన్‌ అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ? 

Online irregularities in issuance of birth and death certificates - Sakshi

ఏళ్లు గడుస్తున్నా చర్యలు శూన్యం 

అవకతవకలు వెలుగు చూసినప్పుడే హడావుడి 

ఆ తర్వాత షరామామూలే 

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం బర్త్, డెత్‌సర్టి ఫికెట్ల జారీలో ఆన్‌లైన్‌ అవకతవకలు గుర్తించి తెగ హడావుడి చేస్తున్న జీహెచ్‌ఎంసీ..ఐదేళ్లకు పూర్వం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా వివిధ అంశాల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎవరిపైనా తగిన  చర్యలు తీసుకోలేదు. అందువల్లే అక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బర్త్, డెత్‌ సర్టి ఫికెట్ల జారీలో చేతులు తడపనిదే పని కాని పరిస్థితి ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుంది.

దాన్ని నివారించేందుకని ఆన్‌లైన్‌ ద్వారా జారీ విధానాన్ని, ప్రజలకు మరింత సులభంగా సేవలందిచేందుకని ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ..కనీస పర్యవేక్షణను గాలికొదిలేసింది. దాంతో ఆన్‌లైన్‌ ద్వారా సర్టి ఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు జత చేయాల్సిన డాక్యుమెంట్ల స్థానే చిత్తుకాగితాలు జత చేసినా సర్టి ఫికెట్లు జారీ అవుతుండటంతోనే అక్రమాలు పెచ్చరిల్లాయి. మీసేవా కేంద్రాల ద్వారా అవి జారీ అయినందున జీహెచ్‌ఎంసీకి సంబంధం లేదని చెబుతున్నా..జీహెచ్‌ఎంసీ–మీసేవా కేంద్రాల సిబ్బంది మధ్య సంబంధం ఉంటుందనే ఆరోపణలున్నాయి. 

ఒకరి భవనం మరొకరికి.. 
ఈ పరిస్థితి ఒక్క బర్త్, డెత్‌ సర్టిఫికెట్లకే పరిమితం కాలేదు. ఆన్‌లైన్‌ ద్వారా భవనాల సెల్ఫ్‌ అసెస్‌మెంట్లలోనూ అదే ధోరణి కొనసాగింది. దాదాపు ఐదేళ్ల క్రితం కొందరి భవనాల్ని వేరే వారికి మ్యుటేషన్లు చేసిన  ఘటనలు సైతం ఉన్నాయి. ఇలా  ఎన్ని అవకతవకలు దృష్టికొచ్చినా, వాటిని నిలువరించేందుకు జీహెచ్‌ఎంసీ శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అక్రమాలు వెలుగుచూసినప్పుడే బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఉంటే తిరిగి అక్రమాలు జరిగేవి కాదని పలువురు భావిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీలో పేరుకు  మాత్రం ఐటీ విభాగం ఉన్నా.. అన్నింటికీ సీజీజీ మీదే ఆధారపడుతోంది. జీహెచ్‌ఎంసీలో పనిచేసి వెళ్లినవారే సీజీజీలో చేరి  మ్యుటేషన్ల అవకతవకలకు పాల్పడ్డారనే ప్రచారం జరిగినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదు. వేలకోట్ల బడ్జెట్‌ ఉన్న జీహెచ్‌ఎంసీకి తగిన విధంగా ఐటీ విభాగం లేదు. బయోమెట్రిక్‌ హాజరులోనూ ఎన్నో పర్యాయాలు నకిలీ వేలిముద్రలు పట్టుబడ్డా చర్యల్లేవు. 

చూసీ చూడనట్లు ఎందుకో..? 
దాదాపుగా అన్ని సేవలూ ఆన్‌లైన్‌ చేశాక.. తమకు పై ఆదాయం తగ్గినందున జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులే  అక్రమాలు జరిగినా చూసీ చూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. తద్వారా ఆన్‌లైన్‌ను ఎత్తివేస్తారనే యోచనతోనే  ఇలా వ్యవహరించి ఉంటారని జీహెచ్‌ఎంసీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు.  

ఇందుకు ఉదాహరణగా సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ వల్ల  ప్రభుత్వ భవనాల్ని సైతం ప్రైవేట్‌ వ్యక్తులు సెల్ఫ్‌ అసెస్‌ చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.  

వీటికి బదులేదీ..? 
కొద్దికాలం క్రితం  బర్త్‌ సర్టి ఫికెట్‌లో పేరులో ఒక అక్షరం తప్పు పడితే  దాన్ని సరిచేసుకునేందుకు మీసేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా..  ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకొని సర్కిల్‌ కార్యాలయాలకు రావాల్సిందిగా సమాచారమిచ్చేవారు. అలాంటి  జీహెచ్‌ఎంసీ అధికారులే    నాన్‌అవైలబిలిటికీ సంబంధించిన బర్త్, డెత్‌ సర్టి ఫికెట్ల జారీలో ఎందుకు కళ్లు మూసుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

 గతంలో  ఏభవనానికి ఎంత ఆస్తిపన్ను బకాయి ఉందో ఎవరైనా తెలుసుకోగలిగేవారు. బకాయిల వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు  భవన యజమాని ఫోన్‌కే ఓటీపీ వచ్చేలా  ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ.. ఎంతో  కీలకమైన సర్టి ఫికెట్లు ఎలాంటి పరిశీలన లేకుండానే జారీ అయ్యేలా ఎందుకు వ్యవహరించిందో అంతుబట్టడం లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top