
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన వాహనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తుక్కు పాలసీ తుస్సుమంటోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చే వాహనదారులకు రవాణాశాఖ సముచితమైన ప్రోత్సాహకాలను ప్రకటించినా వాహనదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలం చెల్లిన వాహనాలపై నిర్బంధంగా నిషేధం విధిస్తున్నారు.
హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం ఒక నెల వ్యవధిలో కనీసం 25 వాహనాలు కూడా తుక్కు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుక్కు బండ్లు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ పొగలు చిమ్ముతున్నాయి. ప్రమాదకరమైన సల్ఫర్, కార్మన్‌మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాలతో ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
వ్యక్తిగత వాహనాలే టాప్...
నగరంలో 15 ఏళ్లు దాటిన వాటిలో వ్యక్తిగత వా హనాలే టాప్‌లో ఉన్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం సుమారు 17 లక్షల బైక్‌లు, మరో 3.5 లక్షల కార్లు తిరుగుతున్నాయి. రవాణా వాహనా ల కేటగిరీలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు తదితర వాహనాలు సైతం కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా వినియోగంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరో లక్ష వరకు సరుకు రవాణా వాహనాలు ఉన్నట్లు అంచనా. గ్రేటర్‌లో 13 వేలకుపైగా స్కూల్ వాహనాలు ఉంటే వాటిలో 2500 వరకు డొక్కు బస్సులే.
సుమారు 1.4 లక్షల ఆటోరిక్షాల్లో కనీసం 25 వేలకు పైగా కాలం చెల్లినవే. ఇవి కాకుండా వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులు, 4 వేల మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. ఇటు వ్యక్తిగత వాహనాలు, అటు రవాణా వాహనాలు అన్నీ కలిపి 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో పీఎం స్థాయి 2.5 శాతం వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల కండీషన్ బాగా లేకపోవడం వల్ల, ఇంజన్ దెబ్బతినడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే సరి..
మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో 5 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు సైతం రిజి్రస్టేషన్ పునరుద్ధరణ సదుపాయం ఉంది.
ఈ వెసులుబాటుతో స్వచ్ఛంద స్క్రాపింగ్‌కు స్పందన రావడం లేదు. చాలామంది రెండో వాహనం ఉన్నప్పటికీ మొదటి వాహనాన్ని వదులుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒక పాత కారు, ఒక కొత్త కారు తప్పనిసరి అవసరంగా వినియోగిస్తున్నారు.
ద్విచక్ర వాహనాల విషయంలోనూ పాతవి, కొత్తవి ఉంటున్నాయి. కానీ పాతవాటిని మాత్రం వదులుకోవడం లేదు.
ప్రోత్సాహకాలు ఇలా..
కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చుకొనే వాహనదారులకు కొత్తవాటి కొనుగోళ్లలో ప్రభుత్వం సముచితమైన ప్రోత్సాహాన్ని అందజేస్తుంది
కొత్త వాహనాల జీవితకాల పన్నులో రాయితీని ఇస్తున్నారు.
రూ.5 లక్షల విలువైన వాహనాల కొనుగోలుపై రూ.10 వేల రాయితీ ఉంటుంది
రూ.5– 10 లక్షల ఖరీదైన వాహనాలపై రూ.20,000
రూ.10–15 లక్షల ఖరీదు చేసేవాటిపై రూ.30,000
రూ.15– 20 లక్షల వరకు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తే రూ.40,000 చొప్పున రాయితీ ఇస్తారు.
తమ పాత వాహనాల తుక్కు సరి్టఫికెట్‌లను ఆరీ్టఏలో అందజేస్తే ఈ రాయితీ లభిస్తుంది.