ఎంపీ అర్వింద్‌ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Serious Comments On MP Arvind - Sakshi

సాక్షి, నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన‍్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. మరోవైపు ఉద్యోగాల కల్పన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి ఎన్నో పథకాలను టీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ జిల్లాలో అబద్ధాలు చెప్పి.. ఒట్టును గట్టుమీద పెట్టిన బీజేపీ నాయకులున్నారు.

ఎంపీ అరవింద్‌పై ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడు. పసుపు బోర్దు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నాము. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించాం. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది. ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదు.

2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా.. బీజేపీ మాత్రం సాయమందించలేదు. తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడు. అరవింద్‌వి పసుపు రైతులకు ఉచిత సలహాలు. 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిస్తే.. ఆయన తీసుకొచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదు. అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. 

ఉత్తరమే రాయలేదంటున్న అరవింద్‌కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన.. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి. 

ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు.. ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారు. గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలి. వరికి సంబంధించి మాట్లాడమంటే.. మాట్లాడని రాహుల్.. ఇక్కడ తెలంగాణాలో రైతు సంఘర్షణ సభ పెట్టడంలో అర్థం లేదు. 2014 నుంచి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని విమర్శించారు. 

ఇది కూడా చదవండి: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top