Hyderabad: అసంపూర్తిగా మిషన్‌ హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన

Mission Hussain Sagar works Not Complete In Hyderabad - Sakshi

2006 నుంచి మొత్తం వ్యయం రూ.326 కోట్లు  

అయినా వీడని మురుగు.. వదలని కాలుష్యం

సాక్షి, హైదరాబాద్‌ : ఏళ్లు గడిచినా మిషన్‌ హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన పనులు అసంపూర్తిగానే మిగిలాయి. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సే న్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగర మథనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్‌ గాడి తప్పింది. సాగర ప్రక్షాళనకు 2006 నుంచి 2021 వరకు దాదాపు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యంగానే మారింది.

సాగర ప్రక్షాళన పనుల్లో ఇప్పటివరకు పూర్తయ్యింది గోరంతే.  మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థా లు జలాశయంలోకి ఇప్పటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలు గా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను  నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

గతంలో చేపట్టిన పనులివే.. 
ప్రధానంగా కలుస్తున్న నాలాలు: కూకట్‌పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు. 
ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు:  
2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు 
 2014: రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్‌ పనులు 
 2015: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలు తొలగింపు. 
 2017, 2018, 2019, 2021: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్‌ కంపెనీ శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ వినియోగం. 
 హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ఇప్పటివరకు చేసిన వ్యయం: దాదాపు రూ.326 కోట్లు 

చేపట్టాల్సిన పనులివే.. 
 జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.  
 దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా తొలగించడం. 
 నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని పూర్తిగా దారి మళ్లించడం. 
 జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం 
 జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్‌ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి.  
 హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రింగ్‌సీవర్‌ మెయిన్స్‌ నిర్మించి జలాశయంలోకి 
మురుగు నీరు చేరకుండా చూడడం. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు. జలాశయంలో ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు ఏరియేషన్‌ వ్యవస్థ ఏర్పాటు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top