రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్‌ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

Published Thu, Apr 20 2023 2:29 AM

Meteorological Department Temperatures rise In Telangana - Sakshi

ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది.     
– సాక్షి ఫొటోగ్రాఫర్‌ , ఆదిలాబాద్‌ 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 

22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం 
శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌ ఉందని వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది.

వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

అప్రమత్తంగా ఉండాలి.. 
ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. 

సాధారణం కంటే అధికంగా.. 
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్‌లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. 

– పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. 

– ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్‌సైట్లో తెలిపింది. 

– ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

దేశవ్యాప్తంగా భగభగలు 
న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్‌ స్పెసిఫిక్‌ డిజాస్టర్‌’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. 

Advertisement
Advertisement