
మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ తెలంగాణ పోలీసులు
రాష్ట్రం డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారినా పసిగట్టలేకపోవడంపై సర్వత్రా చర్చ
ఈగల్, హెచ్–న్యూ వంటి రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నా అక్కరకు రాకపోవడంపై విస్మయం
నిరంతర నిఘా బదులు నామమాత్ర తనిఖీలకే పోలీసులు పరిమితంఅవుతున్నారన్న విమర్శలు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్‌లో ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడటం తెలంగాణ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. డ్రగ్స్ తయారీ అడ్డాగా తెలంగాణ మారినా పసిగట్టలేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలైన ఈగల్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ)... హైదరాబాద్ నగర పరిసరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారీ సంస్థలను ఎందుకు గుర్తించలేకపోతున్నా యన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.
తెలంగాణలో డ్రగ్స్ వాడకానికి తావు లేదని.. డ్రగ్స్ సరఫరా చేసే/వాడే వారి వెన్నులో వణుకు పుట్టిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు, పలు వేదికలపై పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయితే మత్తు ముఠాల పనిపట్టేందుకు... డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవనడానికి తాజా ఉదంతమే ఉదాహర ణగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూతపడ్డ పరిశ్రమలే కాదు.. నడుస్తున్న పరిశ్రమలూ అడ్డాలే...
సాధారణంగా కొన్ని ముఠాలు డ్రగ్స్ తయారీకి నగర శివార్లలోని మూతపడ్డ పరిశ్రమలు, గోదాములను ఎంచుకుంటున్నాయి. వాటిని అద్దెకు తీసుకొని డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సోదాల్లోనూ సంగారెడ్డి, పటాన్‌చెరు, జిన్నారం, జహీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహాలో కొన్ని మూతపడ్డ ఫ్యాక్టరీల్లో అల్ఫ్రాజోలం సహా ఇతర డ్రగ్స్ తయారీని గుర్తించిన ఉదంతాలు ఉన్నాయి. అయితే తాజా ఘటన అంతకుమించి అన్నట్లుగా నిరూపించింది.
ఇటీవల కొందరు డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, అందులో కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశ, విదేశాలకు మాదకద్రవ్యాల ముడిసరుకును చేరవేస్తున్నారు. డైజోఫాం, ఎంఫిటమైన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ వంటి డ్రగ్స్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. వాటి తయారీకి అవసరమైన ముడిసరుకును సేకరించి గుట్టుచప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కమీషన్‌కు ఆశపడే వారిని ఎంచుకొని ఈ తరహా డ్రగ్స్ తయారీకి తెరతీస్తున్నారు.
తాజాగా ఒక ల్యాబ్ మాటున మరో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని నడుపుతుండడం.. అందులో రూ. కోట్ల విలువైన డ్రగ్స్ తయారవుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను తయారు చేసినా వాటిని ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లోని ఏజెంట్లకు చేరవేయక తప్పదు. ప్రైవేటు బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ దశలోనూ స్థానిక పోలీసులు లేదా డ్రగ్స్ కేసుల దర్యాప్తు కోసమే వెలిసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు గుర్తించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటిపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.