
ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారని చెప్పారు
స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ లో చేరారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మొన్న టీవీల్లో చెప్పారు. ఆయనే అప్రూవర్‌గా మారి.. నేరాంగీకారం తెలిపిన తర్వాత విచారణ ఎందుకు? చర్చ ఎందుకు? వారిపై వేటు వేసేందుకు స్పీకర్‌కు మొహమాటం ఎందుకు?’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. హరీశ్‌రావు తిరిగి హైదరాబాద్‌కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన వారు ఏ పార్టీ లో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారన్నారు. స్పీకర్ నిర్ణయంలో తేడా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడింది సుప్రీంకోర్టు ముందు పెడతామని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధికోసమే ‘మేడిగడ్డ’..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు కావాలనే దు్రష్పచారం చేస్తున్నారని.. రాజకీయ కక్షతో కేసీఆర్‌పై కేసు పెట్టేందుకు యత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసిందే రూ.94 వేల కోట్లు అని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ మామ పద్మారెడ్డి క్లియర్‌గా చెప్పారని.. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పిల్లర్లలో రెండు కుంగిపోతే అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి.. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
‘ఫార్ములా– ఈ’ ఓ లొట్టపీసు కేసు..
‘నేను మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా–ఈ ఒక లొట్టపీసు కేసు. ఈ అంశంలో ఎవరైనా వచ్చి నన్ను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చు’అని కేటీఆర్ సవాలు చేశారు. హైదరాబాద్‌కి ఫార్ములా– ఈ రేసును తీసుకురావడానికి తాను ప్రయత్నాలు చేశానని చెప్పారు. రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, డబ్బులు కూడా నిర్దేశిత ఖాతాలోకే చేరాయన్నారు. మంగళవారం నందినగర్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రాసిక్యూషన్ చేసినా, చార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరు’అని కేటీఆర్ స్పష్టం చేశారు.