ఫిక్షన్‌ నుంచి యాక్షన్‌కు..

Know The Facts About Nasa Niac Ideas - Sakshi

అంతరిక్షం గుట్టు తేల్చే వినూత్న ఐడియాలు 

అలా అలా ఆడుతూ పాడుతూ ఆకాశంలోకి దూసుకెళ్తుంటారు.. గ్రహాల్లో తిరిగేస్తుంటారు.. చిత్రవిచిత్రమైన ఆయుధాలతో యుద్ధాలు చేస్తుంటారు.. హాలీవుడ్‌ ఫిక్షన్‌ సినిమాల్లో ఇదంతా మామూలే. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీల్లో చాలావరకు ఒకప్పుడు సినిమాల్లో ఊహించినవే కూడా. అలాగే భవిష్యత్తులో సాకారమయ్యే అవకాశమున్న టెక్నాలజీలే నాసా ‘నియాక్‌’ ఐడియాలు. మరి ఏమిటీ నాసా ‘నియాక్‌’? ఈ టెక్నాలజీలు ఏమిటో తెలుసుకుందామా..     
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌ 

సరికొత్త ఆవిష్కరణల దిశగా.. 
అంతరిక్ష టెక్నాలజీల్లో ఎన్నో అద్భుతాలను సృష్టించినది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. ఉన్న టెక్నాలజీని అభివృద్ధి చేయడం, సరికొత్త సాంకేతికతను సృష్టించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా వినూత్న ఐడియాలను ప్రొత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారిని గుర్తించి.. అందులో ఆచరణ సాధ్యమైనవాటి రూపకల్పన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం నిధులు ఇస్తుంది.

అవసరమైన శిక్షణ, ఇతర సాయమూ అందజేస్తుంది. ఇందుకోసం ‘నాసా ఇన్నోవేటివ్‌ అడ్వాన్స్‌డ్‌ కాన్సెప్ట్స్‌ (ఎన్‌ఐఏసీ– నియాక్‌)ను ఏర్పాటు చేసింది. 2022కు గాను నియాక్‌ ప్రోగ్రామ్‌ కింద 17 ప్రాజెక్టులను ఎంపిక చేసి.. వాటిపై ప్రాథమిక పరిశోధనల కోసం సుమారు రూ.40 కోట్ల నిధులు ఇచ్చింది. 

ఫిక్షన్‌ నుంచి వాస్తవానికి.. 
‘‘సరికొత్త, వినూత్న ఆలోచనలపై పరిశోధన చేపట్టడం, వాటి అమలుకు ప్రయత్నించడమంటే.. సైన్స్‌ ఫిక్షన్‌ (అభూత కల్పన) నుంచి వాస్తవ రూపంలోకి అడుగులు వేసినట్టే..’’ అని నాసా స్పేస్‌ టెక్నాలజీ మిషన్‌ డైరెక్టరేట్‌ శాస్త్రవేత్త జిమ్‌ రూటర్‌ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది పరిశోధనకు ఎంపికైన కొన్ని వినూత్న ఐడియాలు ఇవి.. 

యురోపాపై జీవం గుట్టు తేల్చేందుకు.. 
గురుగ్రహం చుట్టూ తిరిగే యురోపా.. శని చుట్టూ తిరిగే ఎన్సెలాడెస్‌.. ఈ రెండు ఉపగ్రహాలు నిండా మంచుతో కప్పబడి ఉన్నాయి. దాని కింద భారీ సముద్రాలు ఉన్నాయి. అంటే అక్కడ జీవం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఈ గుట్టు తేల్చేందుకు ‘సెన్సింగ్‌ విత్‌ ఇండిపెండెంట్‌ మైక్రో స్విమ్మర్స్‌(స్విమ్‌)’ప్రయోగం చేపట్టనున్నారు. యురోపా, ఎన్సెలాడెస్‌లపై దిగే స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి.. చిన్న మైక్రో స్విమ్మర్లు బయటికి వస్తాయి. అవి మంచును చీల్చుకుంటూ దిగువన సముద్రంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను వ్యోమనౌకకు పంపిస్తాయి.   

వీనస్‌ మేఘాల్లోంచి శాంపిల్‌ కోసం.. 
శుక్రగ్రహం (వీనస్‌)పై సుమారు 40, 50 కిలోమీటర్ల ఎత్తున మేఘాల్లో దాదాపుగా భూమ్మీద ఉన్నట్టుగా జీవానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అక్కడ సూక్ష్మజీవులు వంటి ప్రాథమిక జీవం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రగ్రహ వాతావరణంలో ప్రవేశించి.. అక్కడి శాంపిల్స్‌ను సేకరించి.. తిరిగి భూమిపైకి తీసుకొచ్చే ‘ఒక ఆర్బిటర్‌–ప్రోబ్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌ను రూపొందిస్తున్నారు. 

రేడియేషన్‌ను ఆపేలా.. 
సూర్యుడి నుంచి భారీగా రేడియేషన్‌ వెలువడుతూ ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ, అయస్కాంతశక్తి కారణంగా అది మనపై ప్రభావం చూపలేదు. కానీ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఈ రేడియేషన్‌కు లోనవక తప్పదు. వ్యోమగాములు ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండలేరు. దీన్నుంచి తప్పించేందుకు ‘క్రూ హ్యాట్‌’ పేరిట పరికరాన్ని రూపొందించనున్నారు.ఇది నిర్ధారిత ప్రదేశంలో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిచి రేడియేషన్‌ను అడ్డుకుంటుంది. త్వరలో చంద్రుడిపైకి, మార్స్‌పైకి మానవ యాత్రలు చేపట్టనున్న నేపథ్యంలో ఇది వ్యోమగాములకు రక్షణగా ఉంటుంది. 

ఆస్టరాయిడ్లను ముక్కలు చేసేలా.. 
అంతరిక్షంలో తిరుగాడే గ్రహశకలాల్లో ఏదైనా భూమివైపు దూసుకొస్తుంటే.. దాన్ని ధ్వంసం చేసి, భూమిని కాపాడుకొనేందుకు రూపొందిస్తున్న పరికరమే ‘పై’. ఇప్పటివరకు ఈ విషయంలో పెద్ద పెద్ద అణుబాంబుల వంటి వాటిపైనే శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. వాటినుంచి ఫలితం తక్కువేననే అభిప్రాయాలున్నాయి. అయితే ఆస్టరాయిడ్‌పై వేల సంఖ్యలో చిన్నచిన్న పేలుళ్లు సృష్టించి, ముక్కలు చేసే ఆలోచనతో ముందుకొచ్చినదే ‘పై’. దీని నుంచి ఫలితం కూడా బాగుంటుందని అంచనా వేస్తున్నారు.  

అంతరిక్షంలోనే 3డీ స్పేస్‌సూట్‌ 
వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లాలంటే స్పేస్‌సూట్‌ వేసుకోవడం తప్పనిసరి. వాటి తయారీ కాస్త ఖర్చు, శ్రమతో కూడిన వ్యవహారం. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రలు పెరిగే నేపథ్యంలో.. ఎక్కడైనా 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో స్పేస్‌సూట్లను తయారు చేయడం, మరమ్మతు చేయడం కోసం ప్రత్యేక పరికరాన్ని, అందులో వాడే పదార్థాలను అభివృద్ధి చేయనున్నారు. ఇవి ఎప్పుడంటే అప్పుడు.. ఎవరికి తగినట్టుగా వారికి స్పేస్‌సూట్లను తయారు చేసేలా రూపొందించనున్నారు. 

సూర్యుడి శక్తిని పట్టేసుకుని..
సౌర కుటుంబంలో దూరంగా ఉన్న యురేనస్, నెఫ్ట్యూన్‌ వంటి గ్రహాలు, వాటి అవతల ఉన్న మరుగుజ్జు గ్రహాల వద్దకు స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపాలంటే దశాబ్దాలు పడుతుంది. వందల కోట్ల కిలోమీటర్ల దూరంలోఉన్న వాటి వద్దకు స్పేస్‌క్రాఫ్ట్‌లు త్వరగా వెళ్లాలంటే అత్యంత వేగం అవసరం. ఈ క్రమంలోనే ‘ఒబెర్త్‌ మన్యువర్‌’ సాంకేతికతపై దృష్టిపెట్టారు. అత్యంత వేడిని తట్టుకునేలా స్పేస్‌క్రాఫ్ట్‌కు హీట్‌షీల్డ్‌ అమర్చి సూర్యుడికి దగ్గరగా పంపుతారు.

ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ.. ఆ వేడిని ఇంధనంగా ఉపయోగించుకుంటూ,సూర్యుడి గురుత్వాకర్షణశక్తి సాయంతో విపరీతమైన వేగం పుంజుకుంటుంది. ఆ వేగంతో సౌర కుటుంబం అవతలివైపు ప్రయాణిస్తుంది. ఉదాహరణకు వడిసెలో రాయిపెట్టి తిప్పి విసిరినట్టు అనుకోవచ్చు. సాధారణ స్పేస్‌క్రాఫ్ట్‌లు 20 ఏళ్లలో ప్రయాణించే దూరాన్ని.. ‘ఒబెర్త్‌ మన్యువర్‌’తో కొద్ది నెలల్లోనే చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

శుక్రుడి గుట్టు తేల్చేందుకు.. 
మన భూమిని పోలి ఉన్నా.. వందల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో భగభగ మండుతూ ఉండే గ్రహం శుక్రుడు. దానిపై ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ప్రస్తుతం క్లిష్టమైన వాతావరణంతో నిండి ఉన్న శుక్రుడి గుట్టును పరిశోధించేందుకు ‘బ్రీజ్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేయనున్నారు. సముద్రాల్లో ఉండే స్టింగ్‌రేల తరహాలో డిజైన్‌ చేశారు. గాలి నింపినప్పుడు బెలూన్‌ ఉబ్బినట్టుగా.. చిన్నప్రోబ్‌ నుంచి విమానం ఆకారంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ రూపొందుతుంది. 

మార్స్‌పై గుహల్లో పరిశోధనకు.. 
అంగారక గ్రహంపై వందల కోట్ల ఏళ్లపాటు నీళ్లు పారినట్టుగా ఆధారాలున్నాయి. అంటే జీవం కూడా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ నేపథ్యంలో మార్స్‌పై ఉన్న గుహల లోపలికి వెళ్లి.. పరిశోధించేందుకు ‘ది రీచ్‌బోట్‌’ను రూపొందిస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top