భూ మాయ! 

Jangaon Revenue Officer Enquiry About Rs 23 Crore Cost Land - Sakshi

రూ.23 కోట్ల విలువైన భూమికి ఎసరు 

ఇతర సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్‌ 

పాసుపుస్తకాల కోసం దరఖాస్తు 

రఘునాథపల్లిలో భూబాగోతం 

ఆరా తీస్తున్న రెవెన్యూ అధికారులు 

సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.  

అసలు ఏం జరిగిందంటే.. 
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్‌ ఎడ్యుకేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. 

దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. 
భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల  కో సం రఘునాథపల్లి తహసీల్దార్‌ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్‌ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్‌ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి.

ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్‌ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు.  

గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు 
పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్‌ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. 
పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు    స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top