పక్కాగా ‘సాగునీటి’ ఆస్తుల లెక్క

Irrigation Department is Planning To Settle The assets in Telangana - Sakshi

ప్రాజెక్టుల కింది భూములు, కాల్వలు, భవనాలు, మెషినరీల లెక్కలు కచ్చితంగా ఉండేలా చర్యలు

సీఎం ఆదేశాల నేపథ్యంలో ఈఎన్‌సీ, సీఈలతో ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ వర్క్‌షాప్‌

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి శాఖ పరిధిలోని ఆస్తుల లెక్కలు పక్కాగా తేల్చి, వాటి నిర్వహణ సమర్థంగా ఉండేలా నీటిపారు దల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. శాఖకు చెందిన భవనాలు, క్యాంపు కాలనీలు, వాటిల్లో క్వార్టర్లు, కాల్వలు, టన్నెళ్లు, పంపులు, మోటార్లు, గేట్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, రిజ ర్వాయర్లు, లిఫ్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, వాహనాలు, మెషినరీ, ఫర్నిచర్, భూముల వివరాలను ఇప్పటికే సేకరించిన శాఖ, వాటి నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ ఆస్తుల సమగ్ర వివరాలన్నింటినీ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (పీఎంఎస్‌)లో అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పొందు పరుస్తున్న వివరాలను   ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకునే అంశాలపై అన్ని స్థాయిల ఇంజనీర్లకు శాఖ ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ముఖ్యంగా భూసేకరణ, తర్వాత ఆ భూముల మ్యుటేషన్, రికార్డుల నిర్వహణతో పాటు, వాటి పర్యవేక్షణ, రెవెన్యూ శాఖతో సమన్వయం వంటి అంశాలపై వివిధ స్థాయిల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల ఇన్వెంటరీ నివేదికను తయారుచేసే పనిలోపడ్డ ఇంజనీర్లు ప్రాజెక్టుల నిర్మాణాలకు, వాటి కింది కాల్వలకు సేకరించిన భూముల లెక్కలు తేల్చారు. దీనిపై మంగళవారం సాగునీటి శాఖ ఆస్తుల ఇన్వెంటరీ నిర్వహణపై జలసౌధలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌ కుమార్, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరామ్, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, సీఈలు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, మధుసూధన్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్‌ మాట్లాడుతూ, గడిచిన యాభై ఏళ్లుగా సాధించలేని పనిని ఆరు నెలల్లో సాగునీటి శాఖ ఇంజనీర్లు సాధించారని ప్రశంసించారు.

సాగునీటి వనరుల ప్రధాన లెక్కలు ఇలా..
పీఎంఎస్‌లో పొందుపరచిన వివరాలను గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌రావు ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ అవసరాల కోసం సాగునీటి శాఖ సేకరించిన భూమి 12.80 లక్షల ఎకరాలను ఆధారాలతో సహా పొందుపరచగా, ఈ భూమి మొత్తం రెవెన్యూ అధికారులు సాగునీటిశాఖ పేరు మీదకు బదిలీ చేశారని అన్నారు. ఇరిగేషన్‌ శాఖ పరిధిలో 125 జలాశయాలు, 8,661 కి.మీ ప్రధాన కాలువలు, 13,373 కి.మీ డిస్ట్రిబ్యూటరీలు, 17,721 కి.మీ మైనర్లు, 910 కి.మీల పైపులు, 125 మేజర్‌ ఎత్తిపోతలు, 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8,021 చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు, 175 కి.మీ సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, 64 రెయిన్‌ గేజులు, 21 రివర్‌ గేజులు ఉన్నాయని ఆయన వివరించారు. అనంతరం ఇన్వెంటరీ నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top