జన్మ తల్లిది.. పునర్జన్మ వైద్యుడిది

India Marks National Doctors Day In Honour Of Bidhan Chandra Roy - Sakshi

వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. దానిని నిత్య సత్యం చేస్తూ కలియుగ  దైవం లాగా కరోనా కష్టకాలంలో వైద్యులు చూపుతున్న తెగువ మరువలేనిది. కరోనా సోకితే అయినవారే దగ్గరకు రాని సందర్భంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ జీవితంపై భరోసా కల్పిస్తున్నారు.. వైరస్‌ సోకుతుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని వీడకుండా... కోవిడ్‌ రోగులకు నిరంతరం వైద్యం అందిస్తూ సమాజంపై వారి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆశలు సన్నగిల్లిన వారిలో మళ్లీ చిరునవ్వులు తెప్పించడంలో వారి పాత్ర కీలకం.. రోగులను కరోనా నుంచి కాపాడుతూ వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరెందరో మహమ్మారి కాటుకు బలవుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రజల్లో భరోసానిస్తున్న వైద్యుల జాతీయ దినోత్సవం సందర్భంగా అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

డాక్టర్‌ బీసీ రాయ్‌ సేవలకు గుర్తుగా... 
భారతీయ వైద్య రంగంలో వ్యక్తిత్వంతో పాటు అన్ని తరాలకు ఆదర్శనీయంగా నిలిచిన డాక్టర్‌ బీసీ రాయ్‌ జయంతి సందర్భంగా ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా.. సంఘసంస్కర్తగా.. నిరుపేదలకు అపన్ననేస్తంగా వైద్య సేవలు అందించారు. 1882 జులై ఒకటో తేదీన పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలోని బన్‌కీఫోర్‌లో జన్మించిన అతడు వైద్య రంగంలో చేసిన సేవలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం అనంతరం పశ్చిమబెంగాల్‌కు 12ఏళ్లపాటు సీఎంగా పనిచేశారు. వైద్య రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లో భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆయన పుట్టిన రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. బీసీ రాయ్‌ మరణించిన రోజు కూడా జులై ఒకటో తేదీనే కావడం గమనార్హం. 

సిబ్బందిలో మనోధైర్యం నింపుతూ
నిర్మల్‌ చైన్‌గేట్‌: ఒకవైపు కరోనా మొదటి వేవ్‌ ఉధృతి అంతగా లేనప్పటికీ.. సెకండ్‌ వేవ్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందజేశాం. సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపుతూ రోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూశాం. కరోనాతో ప్రజలు చిన్నపాటి జ్వరం, దగ్గు వచ్చిన చాలా భయపడుతున్నారు. అలాంటి వారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తలు సూచిస్తున్నాం.  

  – డాక్టర్‌ దేవేందర్‌రెడ్డి, నిర్మల్‌ జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకులు 

ధైర్యం కల్పిస్తున్నాం...
నిర్మల్‌ చైన్‌గేట్‌: మొదటి వేవ్‌లో కరోనా సోకినప్పటికీ కోలుకుని విధులు నిర్వహించాను. కరోనా సమయంలో అన్ని ఆస్పత్రుల్లో  చికిత్సలు చేయకపోడంతో జిల్లా ప్రసూతి ఆస్పత్రికి తాకిడి పెరిగింది. ఒక వైపు కరోనా విజృంభన మరో వైపు సిబ్బంది కొరతను అధిగమించి వైద్య సేవలు అందజేశాం. సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకిన 10మంది గర్భిణులకు ప్రసూతి చేశాం. ఎప్పటికప్పుడు గర్భిణులకు, బాలింతలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు చెబుతున్నాం. 

– డాక్టర్‌ రజని, నిర్మల్‌ జిల్లా ప్రసూతి ఆస్పత్రి పర్యవేక్షకురాలు

హాస్టల్‌లో ఉండి విధులు
తాంసి: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో హాస్టల్‌లో ఉంటూ విధులు నిర్వహించాను. నాకు ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా కాలంలో తనవంతుగా కుటుంబ సభ్యులకు, పిల్లలకు దూరంగా ఉన్న బాధపడకుండా వైద్యసేవలు అందించాను. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటికి వెళ్లి అధైర్యపడకుండా ఉండాలని చెప్పాను.

– నర్మద, మండల వైద్యాధికారి

ప్రజల ప్రాణాలు  కాపాడడమే బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజల ప్రాణాలు కాపాడడమే వైద్యుల బాధ్యత. నేను కూడా కరోనా బారిన పడి 14 రోజుల తర్వాత కోలుకున్నాను. ఆ తర్వాత విధుల్లో చేరాను. అధైర్యపడకుండా ఉన్నాను. కుటుంబ సభ్యుల్లో కూడా ధైర్యాన్ని నింపాను. విధి నిర్వహణలో బయటకు వెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాను. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. 

– నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌ 

ఇంట్లో నలుగురం కోవిడ్‌ బారినపడ్డాం
ఆదిలాబాద్‌టౌన్‌: కోవిడ్‌ ఫస్ట్‌వేవ్‌లో మా ఇంట్లో ఉన్న నలుగురు సైతం కోవిడ్‌ బారిన పడ్డాం. వృత్తిరీత్యా మా ఆయన మనోహర్‌ అడిషనల్‌ డీఎంహెచ్‌వో. ఇద్దరు పిల్లలు. గత సెప్టెంబర్‌లో ఒకేసారి అందరం కోవిడ్‌ బారిన పడ్డాం. 17 రోజుల తర్వాత కోలుకొని 18వ రోజున విధుల్లోకి వచ్చాం. ఓపీలో కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణులకు సైతం వైద్యసేవలు అందించాను. గర్భిణులకు అవగాహన కల్పించాం.

– డాక్టర్‌ సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌ 

కరోనా వచ్చినా భయపడలేదు
ఆదిలాబాద్‌టౌన్‌: విధి నిర్వహణలో ఉన్నప్పుడు కోవిడ్‌ ఫస్ట్‌వేవ్‌లో కోవిడ్‌ బారిన పడ్డాను. 14 రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాను. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఐసోలేషన్‌ కిట్‌ను వాడి కోలుకున్నాను. బయట వస్తువులు తినకుండా, నీరు తాగకుండా ఇంటినుంచే టిఫిన్‌ బాక్సును తీసుకెళ్తున్నాను. పౌష్టికాహారం తీసుకోవడంతో త్వరగానే కోలుకున్నా. ఏ వస్తువులను ముట్టకుండా, భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నాను.  కోవిడ్‌ నిబంధనలను పాటిస్తే ఈ మహమ్మారి బారినపడకుండా ఉండవచ్చు.

– డాక్టర్‌ శ్రీకాంత్, జిల్లా కుష్ఠు నివారణ అధికారి, ఆదిలాబాద్‌ 

మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ..
ఆదిలాబాద్‌రూరల్‌: కోవిడ్‌ సమయంలో మానసికంగా ఇబ్బందులు ఎదురైనా గంటల తరబడి కోవిడ్‌ వార్డులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందజేసినా. కోవిడ్‌ సమయంలో ఎలాంటి సెలవులు ఉండవు, 24 గంటలు వైద్య సేవలు అందజేశాను. కోవిడ్‌ సోకిన అధైర్యపడలేదు. ఇంటికి వెళ్లినా రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆలోచనలే ఉండేవి. ఎవరో ఓ డాక్టర్‌తో తప్పు జరిగితే డాక్టర్లను నిందించడం సరికాదు. మూడోవేవ్‌ వస్తుందని ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ప్రతి వైద్యుడు తగిన జాగ్రత్తలు తీసుకోని వైద్య చికిత్స అందజేయాలి.

– డాక్టర్‌ సుమలత, రిమ్స్, అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌    

చదవండి: దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top