Hyderabad: సెప్టెంబర్‌ గండం.. గ్రేటర్‌ వాసుల వెన్నులో వణుకు

Hyderabad September Month Heavy Rain Fall, Great Musi Flood of 1908 - Sakshi

ఏటా ఈ మాసంలోనే కుండపోత వర్షాలు 

1908లో మూసీ వరదలు ఈ నెలలోనే 

గత చరిత్రను పరిశీలిస్తే సుస్పష్టం 

నిండా మునుగుతున్న బస్తీలు, కాలనీలు   

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ వస్తోందంటేనే గ్రేటర్‌ వాసుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఇదే నెలలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీలు, ప్రధాన రహదారులను నిండా ముంచుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చి నగరంలో సగభాగం తుడిచిపెట్టేసిన వరదలు కూడా ఇదే నెలలో.. సెప్టెంబర్‌ 28న సంభవించినట్లు చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు సిటీని అతలాకుతలం చేశాయి.  

చరిత్ర పుటల్లో హైదరాబాద్‌ వరదల ఆనవాళ్లివీ..  
1591 నుంచి 1908 వరకు 14సార్లు వరద ప్రవాహంలో నగరం చిక్కుకుంది. 
1631, 1831, 1903లలో భారీ వరదలతో సిటీలో ధన, ప్రాణ నష్టం సంభవించాయి. 
1908 సెప్టెంబరు వరదలతో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల పాటు జనజీవనం స్తంభించింది.                   
1631లో కుతుబ్‌ షాహీ ఆరో పాలకుడు అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో సంభవించిన వరదలకు నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి.  
1831లో అసఫ్‌ జాహీ నాలుగో మీర్‌ ఫరుకుందా అలీఖాన్‌ నాసరుదౌలా పాలనా కాలంలోనూ వరదలు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది.    
ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్‌ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ఇక 1968, 1984, 2000, 2007, 2016, 2020లలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ నిండుగా ప్రవహించింది.  

చదవండి: (విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్‌’ సిటీ పరిస్థితి ఏంటి?)

1908.. సెప్టెంబరు 28న కొట్టుకుపోయిన సిటీ.. 
మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ మహోగ్ర రూపం దాల్చింది. కేవలం 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులు. వరదనీరు ఇటు చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్‌ దాటి శాలిబండ వరకు పోటెత్తింది. చంపా దర్వాజా ప్రాంతంలోకి చేరడంతో అక్కడే ఉన్న  పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. రెండు గంటల్లోనే నీటి ప్రవాహానికి పేట్లబురుజు కొట్టుకుపోయింది. వందల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 28న సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. జనం హాహాకారాలు చేశారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. 

నాటి పాలకుడు నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలినడక జనం మధ్యకు వచ్చారు. వరద బాదితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి మహారాజా కిషన్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భననాలను ప్రజల కోసం తెరిచిఉంచాలని కోరారు. పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్‌ల్లో వైద్య శిబిరాలు, అన్న దానం ప్రారంభించారు. అన్ని «శాఖల సిబ్బందిని వరద బాధితుల సహాయం కోసం పని చేయాలని సర్కార్‌ ఆదేశాలిచ్చింది. నాటి నుంచి సెప్టెంబర్‌ నెల వచ్చిందంటే నగర ప్రజలు వరదలకు భయపడుతూనే ఉన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top