‘కరోనా’తో కొవ్వుల వ్యవస్థ హైజాక్‌!

Human Fat System Affected To Collapse By Coronavirus - Sakshi

బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన కణాల్లో కొవ్వులను ప్రాసెస్‌ చేసే వ్యవస్థను దెబ్బ తీస్తుందని చైనాకు చెందిన అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా.. దీని వివరాలు నేచర్‌ మెటబాలిజం జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌తో కూడిన కణాలను పరిశోధనశాలలో వృద్ధి చేశారు.

వీటిని పరిశీలించినప్పుడు శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్‌ కొవ్వులు అతుక్కునే భాగానికే వైరస్‌ కూడా అతుక్కున్నట్లు గుర్తించారు. ఆ భాగాన్ని తొలగించి పరిశీలిస్తే వైరస్‌ మానవ కణానికి అతుక్కోవడం నిలిచిపోయింది. ఈ అంశం ఆధారంగా వ్యాధి చికిత్సకు కొత్త మందులు తయారు చేయొచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి తాము ప్రాథమిక పరిశీలనలు మాత్రమే జరిపామని, ఇన్ఫెక్షన్‌ను ఎక్కువ చేసేందుకు వైరస్‌ కొలెస్ట్రాల్‌ జీర్ణ వ్యవస్థను వాడుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు.

అధిక ఫాస్ఫరస్‌ వినియోగానికి చెక్‌!
హైదరాబాద్‌: చీడపీడల నుంచి రక్షణకు లేదా మొక్కలు ఏపుగా ఎదిగేందుకు చాలామంది రైతులు ఎరువులను విచ్చలవిడిగా వాడటం మనం చూసూ్తనే ఉంటాం.. ఇది కాస్తా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయేందుకు కారణమవుతోంది. మిగిలిన ఎరువుల మాటెలా ఉన్నా ఫాస్ఫరస్‌ను అతితక్కువగా వినియోగించేలా చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గాన్ని గుర్తించారు. ఎరువుగా వేసిన ఫాస్ఫరస్‌ మట్టిలోని రసాయనాలతో కలసిపోయి మొక్కకు అందకుండా పోతుంటుంది. దీంతో రైతులు అవసరానికి మించి ఫాస్ఫరస్‌ వాడటం అది కాస్తా నిరుపయోగంగా పరిసరాల్లోని జలవనరుల్లోకి చేరుతుండటం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

చెట్ల వేర్లపై ఉండే ఎండోఫైట్స్‌ అనే సూక్ష్మజీవులతో ఈ సమస్యను అధిగమించవచ్చునని వాషింగ్టన్‌ యూనివర్సిటీ, పసిఫిక్‌ నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఎండోఫైట్స్‌ మట్టిలోని ఫాస్ఫరస్‌ను మొక్కలకు చేరవేయగలవని వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించగా.. తాజాగా వీరు పసిఫిక్‌ నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీతో కలసి కొన్ని ప్రయోగాలు చేశారు. పోప్లర్‌ చెట్టు వేర్ల ప్రాంతంలోని ఎండోఫైట్స్‌ మట్టిలోని రసాయనాల నుంచి ఫాస్ఫరస్‌ను వేరు చేసినట్లు ఈ ప్రయోగాల్లో తేలింది. పోప్లర్‌ మొక్కలు ఈ ఫాస్ఫరస్‌ను ఉపయోగించుకున్నట్లు కూడా స్పష్టమైంది. ఎండోఫైట్స్‌ను కృత్రిమంగా పెంచి మట్టిలోకి కలపడం ద్వారా మొక్కలకు ఫాస్ఫరస్‌ బాగా చేరేట్టు చేయవచ్చునని లేదా విత్తనాలకు ఎండోఫైట్స్‌ పూత పూసినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

బ్యాగేజీ ఎక్కడుందో చెబుతుంది
శంషాబాద్‌: ఆధునిక సాంకేతిక వినియోగంతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరో అడుగు పడింది. ప్రయాణికులకు అవసరమైన బ్యాగేజీ ట్రాలీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. దీంతో దేశంలోనే ట్రాలీలకు సాంకేతికను అనుసంధానించిన తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. బ్యాగేజీ ట్రాలీలకు ‘లాంగ్‌ రేంజ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్‌’అనే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 3 వేల బ్యాగేజీల ట్రాలీలకు ఈ సాంకేతికను అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు బ్యాగేజీ ట్రాలీల కోసం ఎదురు చూసే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాలీలను అందుబాటులో ఉంచే ప్రక్రియ సులువుగా మారుతుంది.

ఆపరేషన్‌ టీంలు ఎయిర్‌పోర్టులోని రియ ల్‌ టైమ్‌ డ్యాష్‌బోర్డులలో పొందుపర్చే సమాచారం ద్వారా ప్రయాణికులకు అనుగుణంగా వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం ఉంటుంది. లాప్‌టాప్, మొబైల్‌ల ద్వారా కూడా ట్రాలీలు ఎక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని కూడా వెంటనే తెలుసునే సౌలభ్యం ఉంది. వీటితో పాటు అలర్ట్‌ మెకానిజం ద్వారా ట్రాలీలను ‘నో ఎయిర్‌పోర్టు జోన్‌’లోకి ఎవరైనా తీసుకెళితే వెంటనే అప్రమత్తమయ్యే సందేశాలు సంబంధిత విభాగాలకు చేరుకుంటుంది. దీంతో సంబంధిత సిబ్బంది వాటిని వెంటనే సరైన ప్రాంతాలకు తీసుకెళ్తారు. 

మెరుగైన సేవల్లో భాగంగానే..
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నిరంతరం శ్రమిస్తోంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటికే ఈ– బోర్డింగ్, ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను పెంపొందిస్తున్నాం.  –ఎస్‌జీకే కిశోర్, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుల చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top