బాలానగర్‌లోని విలువైన భూమిపై హైకోర్టు ఉత్తర్వులు
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దంటూ 2008లో బీఐఎఫ్‌ఆర్ ఆదేశం
ఆ ఆదేశాలను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు
పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఐడీపీఎల్ అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్‌లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోకుండా 2008 నాటి పారిశ్రామిక, ఆర్థిక పునర్విర్మాణ మండలి (బీఐఎఫ్‌ఆర్) ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనే ప్రభుత్వం భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నందున, బీఐఎఫ్‌ఆర్ ఉత్తర్వులో హేతుబద్ధత లోపించిందని చెప్పింది. నాటి ఉత్తర్వు అమలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూడ్చలేని నష్టాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించడం కూడా జరిగిందని గుర్తు చేసింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది. ఈ వివాదం 90వ దశకంలో మొదలైంది.
అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వినియోగం కోసం ఆ భూమిని సేకరించి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌ను స్థాపించడానికి ఐడీపీఎల్‌కు బదిలీ చేసింది. ఆ భూమిని కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలనే నిర్దిష్ట ఒప్పందం కింద అప్పగించారు. అయితే, ఐడీపీఎల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, తన పరిపాలనా భవనాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. వివాదం బీఐఎఫ్‌ఆర్‌కు చేరడంతో.. భూ స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, కంపెనీపై బలవంతపు చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
మూడో పక్షానికి లీజుకివ్వడం కుదరదు..
ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం బదిలీ చేసిన భూమిని ఒక సాధారణ ప్రైవేట్ అమ్మకంలా పరిగణించకూడదన్నారు. ఒప్పందం ప్రకారం పరిశ్రమల స్థాపన కోసమే ఈ భూమిని వినియోగించుకోవాలి తప్ప.. మూడో పక్షానికి లీజుకు, సబ్ లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయ వనరుగా మార్చుకోకూడదన్నారు. ఐడీపీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2008లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌లో తీవ్ర జాప్యం జరిగిందని, పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2008 నుంచి చట్టపరమైన పరిస్థితులు గణనీయంగా మారాయన్నారు. బీఐఎఫ్‌ఆర్‌ను రద్దు చేశారని, కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు సక్రమంగా బదిలీ చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల కోసం లీజుకు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేమన్నారు. నాటి ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


