హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.
ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.
‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్‌లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.
నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్ రావు అన్నారు.


