ఆమె అక్షర... లక్ష్మి | Girls at top of higher education Telangana | Sakshi
Sakshi News home page

ఆమె అక్షర... లక్ష్మి

Mar 8 2023 1:09 AM | Updated on Mar 8 2023 8:03 AM

Girls at top of higher education Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్‌. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం.

వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు.  సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది.

అబ్బురపరిచే అంకెలు
► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్‌కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్‌లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107.

► జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్‌ దాదాపు రివర్స్‌ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం.

► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. 


పరిశోధనల వరకూ వెళ్ళాలి
మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్‌ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్‌ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. 
– ప్రొఫెసర్‌ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ 

సాధికారత సాధించాలి
విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు,  ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి.
– వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి 

డిజిటల్‌ టెక్నాలజీ వైపు అడుగులేయాలి
విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్‌ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్‌లో ప్రత్యేక కోర్సును డిజిటల్‌ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. 
– ప్రొఫెసర్‌ కవిత దార్నా, వీసీ, జేఎన్‌ఎఫ్‌ఏ

విధాన నిర్ణేతలుగా ఎదగాలి 
చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్‌ జాబ్స్‌లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. 
– సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్‌ యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement