జీహెచ్‌ఎంసీకి పైసా పరేషాన్‌.. గండం గట్టెక్కేనా?

GHMC Has Short Of Funds Due To Property Taxes - Sakshi

రూ.6000 కోట్లు బడ్జెట్‌లో ఇచ్చింది రూ.10 కోట్లే 

మహానగర పాలక సంస్థకు తప్పని తిప్పలు 

పేరుకుపోయిన సర్కారు భవనాల ఆస్తిపన్నులు

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీకి వివిధ ప్రభుత్వ శాఖలకు  చెందిన భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నప్పటికీ, చెల్లింపులు మాత్రం గోరంతలు కూడా ఉండటం లేదు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచీ వివిధ ప్రభుత్వ భవనాల ద్వారా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను, వాటిపై బకాయిలు దాదాపు రూ.6000 కోట్లు పేరుకుపోయాయి. వీటిల్లో పాత సచివాలయ భవనాలకు సంబంధించి దాదాపు రూ. 400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ సచివాలయం అంతర్ధానమై, కొత్త సచివాలయం త్వరలో  ప్రారంభం కానున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ బకాయిల  చిట్టాలో మాత్రం అలాగే ఉంది. దాంతోపాటు వైద్యారోగ్య, విద్యాశాఖ, ఎక్సైజ్,  ట్రాన్స్‌కో, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన భవనాల నుంచి దశాబ్దానికిపైగా ఆస్తిపన్ను బకాయిలు పెనాల్టీలతో కలిపి కొండల్లా పేరుకుపోయాయి. 

బడ్జెట్‌లో పద్దు ఉన్నా.. 
ఆస్తిపన్ను బకాయిలు ఏటికేడు పెరిగిపోతున్నా, జీహెచ్‌ఎంసీ ఆయా ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిందిగా లేఖలు రాస్తున్నా నయాపైసా కూడా విదిల్చడం లేదు. వీటి చెల్లింపుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఓ పద్దు కూడా ఉంది. కానీ.. చెల్లింపులే ఉండటం లేదు. ఆరేడేళ్ల క్రితం ఏటా కనీసం రూ. 50 కోట్లయినా బడ్జెట్‌లో కేటాయించి విడుదల చేసేవారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇది కేవలం రూ.10 కోట్లు మించడం లేదు. తాజా రాష్ట్ర బడ్జెట్‌లోనూ రూ. 10 కోట్లే విదిల్చారు.  

జీహెచ్‌ఎంసీకి తప్పని తిప్పలు.. 
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన, పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు సదరు ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడం, మరోవైపు జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు ఇవ్వకపోవడంతో జీహెచ్‌ఎంసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంబంధిత ఉన్నతాధికారులు నిధుల లేమి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా.. లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేయడంతో వాటి వడ్డీలు, ఇతరత్రా ఖర్చులు భరించలేక సిబ్బంది జీతాలకే పలు అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోకపోతే జీహెచ్‌ఎంసీ గడ్డు పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి.  

ఓటీఎస్‌ను వినియోగించుకోని వైనం.. 
ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన వారు పెనాల్టీల భారాన్ని మోయలేకే చెల్లించడం లేదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) కింద ఆస్తిపన్ను పెనాల్టీలపై 90 శాతం రాయితీనిచ్చింది. ప్రభుత్వ భవనాలకు ఆ స్కీమ్‌ను సైతం వినియోగించుకోలేదు.  దాన్ని వినియోగించుకొని చెల్లించినా, జీహెచ్‌ఎంసీకి భారీ ఆదాయం సమకూరేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెనాలీ్టలే అసలును మించి భారీ బకాయిల గుట్టలుగా మారాయి.

ఎన్నెన్నో భవనాలు.. 
ఆస్తిపన్ను బకాయిలు భారీగా ఉన్న భవనాల్లో అసెంబ్లీ, రవీంద్రభారతి, హెచ్‌ఎండీఏ, ఆస్పత్రులు, విద్యాలయాలకు చెందినవే కాకుండా పెట్రోలు బంకులు, క్యాంటీన్ల వంటివి సైతం ఉన్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీకి రావాల్సింది 

జీహెచ్‌ఎంసీకి రావాల్సిన మొత్తం   
సచివాలయ పాతభవనం : రూ.400 కోట్లు 
వైద్యారోగ్యశాఖ భవనాలు : రూ.1190 కోట్లు  
ఎక్సైజ్‌ శాఖ భవనాలు: రూ. 900 కోట్లు  
విద్యాశాఖ భవనాలు:  రూ.400 కోట్లు  
జలమండలి భవనాలు : రూ.70 కోట్లు  
 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top