‘ఖాకీ‘లతో రాజకీయం.. టీఆర్‌ఎస్‌లో తారస్థాయికి వర్గ విభేదాలు

Gadwal: Cold War Goes To Peak Among Several Leaders In TRS - Sakshi

చీకటి దందాల్లో సైతం ఆధిపత్యమే హద్దుగా చెలగాటం

పోలీస్‌ శాఖను అడ్డుపెట్టుకుని వ్యవహారం

రెండు వర్గాలుగా చీలిన ఖాకీలు?

‘గద్వాల’లో కలకలం రేపుతున్న పరిణామాలు

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు పరిధిలోని జోగుళాంబ గద్వాలలో ‘అధికార’ పార్టీ టీఆర్‌ఎస్‌లో పలువురు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌ వార్‌ తారస్థాయికి చేరింది. ఇరువురి నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు.. మారుతున్న పరిణామాల క్రమంలో భగ్గుమన్నాయి. చీకటి దందాల్లో సైతం ఆధిపత్యమే హద్దుగా ఎవరికి వారు పావులు కదుపుతుండడంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.

అసాంఘిక శక్తుల భరతం పట్టి, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక భూమిక వహించాల్సిన పోలీస్‌శాఖను సైతం కీలుబొమ్మగా మార్చిన విధానం ప్రజలను నివ్వెరపరుస్తోంది. ఇరు వర్గాలూ ఖాకీలను తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న తీరు ఒక్కొక్కటిగా ఇటీవల వెలుగులోకి రాగా.. విస్మయానికి గురిచేస్తోంది. ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా చెలామణి అవుతున్న ఇరువురు ప్రజాప్రతినిధులు పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై పోటాపోటీగా ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలో పోలీస్‌ శాఖ రెండుగా చీలిపోయిందనేందుకు ఇదే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అంతా మాఫియా కనుసన్నల్లోనే..  
నడిగడ్డగా పేరొందిన గద్వాల జిల్లా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. నకిలీ విత్తనాలు, రేషన్‌ బియ్యం, ఇసుక, గుట్కా, మట్టి ఇలా అన్ని రకాల దందాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలో ఏది జరగాలన్నా ఆయా మాఫియాల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. వీరికి రాజకీయ నేతలు జత కలిసి ఖాకీలతో తతంగం నడిపిస్తుండడంతో దోచుకున్నోడికి దోచుకున్నంతగా పరిస్థితులు దాపురించాయి. క్రమశిక్షణకు వరుపేరుగా నిలిచే పోలీస్‌శాఖలో కొందరు పోలీసులు రాజకీయ నేతల అండతో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

జిల్లాలో ఓ సర్కిల్‌ స్థాయి పోలీస్‌ అధికారిపై ఫిర్యాదుతో అక్రమాల తుట్టె ఒక్కొక్కటిగా కదిలింది. విచారణలో రాజకీయ నేతల అండ, పలువురు ఖాకీల మద్దతుతో అక్రమాలు పరాకాష్టకు చేరాయని గ్రహింన సదరు అధికారి పోలీస్‌ బాస్‌కు మొత్తం సమాచారం మౌఖికంగా చేరవేశారు. దీంతో జిల్లాలో ఏయే దందాల్లో ఎవరెవరు కీలకంగా ఉన్నారు.. ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.. వీటిలో పోలీస్‌ సిబ్బంది పాత్రపై నిఘా వర్గాల ద్వారా పూర్తిస్థాయిలో సమాచారం సేకరింనట్లు తెలిసింది.

కొందరి వల్ల పోలీసు శాఖకే చెడ్డపేరు 
గద్వాలలో కొందరు పోలీసుల వైఖరి కారణంగా మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుంది. పైరవీకారులు, అక్రమాలకు పాల్పడే వారికే అధిక ప్రాధాన్యత ఇస్త డిపార్ట్‌మెంట్‌కు తలవంపులు తీసుకొస్తున్నారు. ఇటీవల బియ్యం, ఇసుక, మట్టి, సీడ్, భూకబ్జాలు వంటి మాఫియాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. దీనికి కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న పారదర్శకత వైఖరి లేకపోవడమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని చట్టాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ప్రజాసమస్యలపై మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటే మంచింది.
 – మధుసూదన్‌బాబు, జేఏసీ నాయకుడు, గద్వాల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top