తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!

First Mammal Found in Naskal near Parigi Telangana - Sakshi

పరిగి సమీపంలోని నష్కల్‌లో దేశంలోనే తొలి ఆధారం 

మూడు దశాబ్దాల పాటు జియాలజిస్టుల పరిశోధన

సైన్స్‌ జర్నల్‌ పేలియో3లో ప్రచురణ 

సాక్షి, హైదరాబాద్‌: భూమ్మీద క్షీరదాల (పాలిచ్చి పెంచే జీవుల) ఉనికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అవి తొలుత ఎక్కడ పుట్టాయి? ఎక్కడెక్కడ తిరిగాయి? అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అలా ఇప్పటివరకు ఎక్కడో అర్జెంటీనాలో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు దొరకగా.. ఆ తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలోనే వాటి గుట్టు బయటపడింది. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో పరిగి మండలం పరిధిలోని నష్కల్‌లో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు లభించాయి. అమెరికా కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ పేలియోజియోగ్రఫీ, పేలియోక్‌లైమటాలజీ, పేలియోఎకాలజీ (పేలియో3) ఈ వివరాలను తమ ఆన్‌లైన్‌ జర్నల్స్‌లో ప్రచురించింది. ఏప్రిల్‌లో ముద్రణగా దీన్ని ప్రచురించనుంది. 

తొలినాళ్ల క్షీరదాలేమిటి..? 
కోట్ల ఏళ్ల కింద భూమిపై రాక్షస బల్లులు, ఇతర సరీసృపాలదే రాజ్యం. ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం అవి అంతరించిపోయాయి. ఆ సమయంలోనే క్షీరదాల (పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు) ఉనికి మొదలైంది. చిన్నగా ఎలుకల పరిమాణంలో ఉండే క్షీరదాలు కలుగుల్లో, చెట్ల పొదల్లో మనుగడ సాగించాయి. డైనోసార్లు అంతమయ్యాక వాటికి శత్రువులు తగ్గి.. పరిణామం చెందాయి. ఇప్పుడున్న చాలా రకాల జంతువులుగా మారాయి. నాటి తొలితరం క్షీరదాల ఆధారాలు మొదట్లో అర్జెంటీనా దేశంలో వెలుగు చూశాయి. చాలా ఏళ్లపాటు ప్రపంచానికి ఆ వివరా లే దిక్కయ్యాయి. తర్వాత మన నష్కల్‌ ప్రాంతంలో ఆధారాలు బయటపడ్డాయి. స్వాతంత్య్రానికి పూ ర్వం 1930 దశాబ్దంలో ప్రఖ్యాత జియాలజిస్టు శర్మ.. ఈ ప్రాంతంలో రాక్షస బల్లుల శిలాజాలతోపాటు ఇతర జీవుల జాడలు గుర్తించారు.

చదవండి: (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..)

తర్వాత 1970ల్లో ఎన్‌వీబీఎస్‌ దత్త మరికొన్నింటిని గుర్తించారు. ఇలా నష్కల్, దానికి చేరువలో ఉన్న బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌ మధ్య జీవ మహాయుగం (మోసోజోయిక్‌ పీరియడ్‌) నాటి జీవ పరిణామానికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ క్రమంలో 1980ల్లో సహానీ, జీవీఆర్‌ ప్రసాద్‌ల బృందం తొలిసారి పురాతన క్షీరదాల ఆధారాలు సేకరించింది. ఆ వివరాలు ఇప్పటికే ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. ఇక 1990 దశకంలో ప్రఖ్యాత జి యాలజిస్టు అనంతరామన్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. నష్కల్‌ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధన చేసి.. పురాతన సూక్ష్మ క్షీరదాలకు చెందిన దంత శిలాజాలను సేకరించింది. వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి.. అవి డైనోసార్లు అంతరించే కాలానికి చెందిన, తొలితరం క్షీరదాలని తేల్చింది. ఈ వివరాలు అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ పేలియో3లో ప్రచురితం అవుతున్నాయి.

ఎంతో తృప్తినిచ్చింది 
తొలితరం క్షీరదం జాడకు సంబంధించి నష్కల్‌ ప్రాంతంలో ఆధారాలు దొరికాయి. ఇక్కడ  చేసిన పరిశోధన ఎంతో తృప్తినిచ్చింది. మరింత పరిశోధన చేస్తే ఎన్నో రహస్యాలకు సమాధానం చెప్పే ఆధారాలు దొరకవచ్చు. 
– అనంతరామన్, పరిశోధన బృందం సభ్యుడు 

గొప్ప పరిశోధనకు గొప్ప గుర్తింపు 
నష్కల్‌ ప్రాంతం ఎన్నో జియోలాజికల్‌ రహస్యాలను ఛేదించే ఆధారాలకు కేంద్రం. క్షీరదాల పుట్టుక ఆధారాలు మొదట్లో అర్జెంటీనాలోనే వెలుగుచూశాయి. మన దేశంలో తొలి సారి నష్కల్‌లోనే బయటపడ్డాయి. ఇక్కడ తొలితరం క్షీరదాల దవడ శిలాజాలు సేకరిం చాం. వాటిపై అనంతరామన్‌ బృందం విస్తృత పరిశోధన చేసింది. ఈ వివరాలు సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమవడం సంతోషం. 
– చకిలం వేణుగోపాలరావు, జీఎస్‌ఐ రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top