
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా: ‘కొడుకా.. నువ్వే గుర్తొస్తున్నావ్... ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా చూసుకున్నా.. చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన. మాయ దారి బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నా.. సరే బిడ్డా అని ధైర్యం చెప్పిన. అయినా మమ్మల్ని మోసం చేస్తివి. బెట్టింగ్‌కు బలై ఈ లోకాన్నే విడిచిపోతివి. నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుకా.. నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డా’అంటూ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు(49) కొడుకు నిఖిల్‌రావు (21) ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. అవి తీర్చలేక, మానసిక ఒత్తిడితో రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో కొడుకు.. అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.