నిమిషం లేటైనా నో ఎంట్రీ | EAPCET Exam: No Entry To Students Due To One Minute Late | Sakshi
Sakshi News home page

నిమిషం లేటైనా నో ఎంట్రీ

May 3 2026 5:53 AM | Updated on May 3 2026 5:53 AM

EAPCET Exam: No Entry To Students Due To One Minute Late

4, 5 తేదీల్లో అగ్రి, ఫార్మాసెట్‌

9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష

ఏర్పాట్లు పూర్తి: ఈఏపీసెట్‌ కన్వీనర్‌ కె.విజయకుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దీనిని ఈ నెల 11వ తేదీ వరకూ రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌ ఉంటుంది. 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్‌ ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులంతా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ సెట్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె.విజయకుమార్‌ రెడ్డి తెలిపారు.  

విద్యార్థులకు కీలక సూచనలు
ఉమ్మడి ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఉదయం సెషన్‌లో పరీక్ష ఉన్న వాళ్లు 7.30 గంటలకు, సాయంత్రం సెషన్‌లో పరీక్ష ఉంటే మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.  
 పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులకు బయో మెట్రిక్‌ పరీక్ష ఉంటుంది. కుడిచేతి బొటన వేలి ముద్ర తీసుకుంటారు. దీంతో పాటు ఫొటో కూడా పరిశీలిస్తారు.  

చేతులకు మెహిందీ, టాటూస్, ఇంక్‌ ముద్రలు ఉంటే పరీక్ష కేంద్రానికి అనుమతించరు. బ్లాక్‌ లేదా బ్లూ పెన్, హాల్‌ టికెట్, గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్‌ను దృష్టిలో ఉంచుకుని చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  
 క్యాలిక్యులేటర్, మేథమెటికల్, లాగ్‌ టేబుల్స్, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.  

Advertisement
 
Advertisement
Advertisement