ఆన్‌లైన్‌ పాఠాలా.. జర జాగ్రత్త.. 

Dr Dasaradha Rama Reddy Speaks About Online Education - Sakshi

మరింత మర మనుషులు అవుతారేమో!

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు, సోషల్‌ యాక్టివిస్ట్‌ డా.దశరథరామారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో విద్యారంగం, బోధనా పద్ధతులు, విధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. చిన్న తరగతులు మొదలు పీజీ స్థాయి వరకు ఆన్‌లైన్‌ చదువు తప్పనిసరైంది. బోధన, పిల్లలు నేర్చుకునే పద్ధతుల్లో ఇదో అనూహ్యమైన మార్పు అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆన్‌లైన్‌ చదువే అన్నింటికీ పరిష్కారం కాదని, ఇందులోనూ మంచి, చెడులున్నాయనే వారూ ఉన్నారు. విద్యాసంవత్సరం కోల్పోకుండా ఇదొక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు, సోషల్‌ యాక్టివిస్ట్‌ డాక్టర్‌ దశరథరామారెడ్డి వివరించారిలా...

సంప్రదాయ, ఆన్‌లైన్‌ బోధనకు వ్యత్యాసాలు
‘‘ఆన్‌లైన్‌ చదువులతో పిల్లలు ‘రోబో’ల్లాగా తయారవుతారని అనిపిస్తోంది. సంప్రదాయ బోధనకు, ఆన్‌లైన్‌ పాఠాలకు ఎన్నో వ్యత్యాసాలున్నాయి. విద్యాసంవత్సరం నష్టపోకుండా ‘ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌’తప్పనిసరి కానుంది. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా పిల్లలు వెన్నెముక, కళ్ల సమస్యలతో ఆసుపత్రులకు రావడం మొదలైంది. ఏకబిగిన కొన్ని గంటలపాటు టీవీ స్క్రీన్‌ లేదా కంప్యూటర్‌ మానిటర్, మొబైల్‌ ఫోన్లో పాఠాలు చూడడం, వినడం, వ్యాయామం లేకపోవడం(ఇప్పటికే అలవాటు పడిన జంక్‌çఫుడ్‌కు తోడు)తో ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి. 

ఆన్‌లైన్‌ పాఠాలు వినేప్పుడు..
ఆన్‌లైన్‌ క్లాసులకు సరైన సీటింగ్, లైటింగ్‌ ఉండాలి. 90 డిగ్రీల కోణంలో కుషన్‌ లేని గట్టి కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి. మెడ తిప్పడంలో ఇబ్బందుల్లేకుండా కంప్యూటర్‌ లేదా టీవీని పెట్టుకోవాలి. స్క్రీనుకు తగినంత దూరం పాటించాలి. ప్రతి 45 నిముషాల క్లాస్‌కు కనీసం 5 నిమిషాల విరామం ఇవ్వాలి. కళ్లను అప్పుడప్పుడు విప్పారించి, తరచూ రెప్ప ఆర్పుతూ చూడాలి. కళ్లు పొడారిపోకూడదు. చేతివేళ్లు బిగుసుకుపోకుండా ఉండేలా మధ్య, మధ్యలో మెటికలు విరవడం, స్ట్రెస్‌ బస్టర్‌ స్పాంజ్‌ బంతులను ఒత్తడం వంటివి చేయాలి. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు సెల్‌ఫోన్లు వాడడం మంచిది కాదు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు కూడా ఈ క్లాస్‌లు పెట్టడం వల్ల ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి. ఆన్‌లైన్‌ చదువుతో టీచర్లు– విద్యార్థుల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం దెబ్బతింటుంది. మొత్తంగా సంప్రదాయ విద్యాబోధనకు ఆన్‌లైన్‌ చదువులు ప్రత్యామ్నాయం కాలేవు’

సానుకూల అంశాలు...
► పిల్లలు సమయం వృథా చేయకుండాసద్వినియోగం అవుతుంది
► ఈ సాంకేతికతను ఎలా ఉపయోగిం చాలన్నది తెలియడం భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగం
► విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలోతెలిసొచ్చి ధైర్యంగా ఉండడం అలవాటవుతుంది
► స్కూలు, కాలేజీలకు వెళ్లి వచ్చే సమయం, శ్రమ ఉండవు కాబట్టి ఆ ఖర్చు కూడా ఆదా 

ప్రతికూల అంశాలు...
► డిజిటల్‌ స్క్రీన్‌ టైం గణనీయంగా పెరిగి తలనొప్పి, కంటిచూపు సమస్యలు పెరిగే అవకాశం
► విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ క్లాస్‌ల సౌకర్యం అందుబాటులో ఉండకపోవడం
► శారీరక వ్యాయామం, శిక్షణ లేక పిల్లల్లో చురుకుదనం తగ్గే అవకాశం
► టీచర్లు పిల్లలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం తక్కువ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top