బీజేపీ దేశానికి చాలా ప్రమాదం.. అంబేద్కర్‌ ఆనాడే హెచ్చరించారు: సీపీఐ రాజా

CPI D Raja Speech At BRS Khammam Public Meet - Sakshi

సాక్షి, ఖమ్మం: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నా.. తెలంగాణలో సుపరిపాలన అందుతోంది. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్, తాగునీరు అందుతున్నాయి. రైతుబంధు, దళితబంధు పథకాలు దేశానికే ఆదర్శం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. మోదీ వెనుక అంబానీ, అదానీ ఉండి నడిపిస్తున్నారు.

రిపబ్లిక్‌ దేశంగా ఉన్న దేశాన్ని మార్చి ఒకే మతం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్నారు. మోదీ పేదలు, రైతుల పక్షాన లేకుండా.. అదానీ, అంబానీ, టాటా బిర్లాల జపం చేస్తున్నారు. బీజేపీ గవర్నర్‌ వ్యవస్థను చేతిలో పెట్టుకొని కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్‌ను ఇబ్బంది పెడుతోంది. 2024లో అందరు కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఐక్య పోరాటాలు చేయాలి. ఐక్య పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలి. బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం’ అని డి.రాజా చెప్పారు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top