
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో కమలం వికసిస్తుందని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడి పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అరాచకాలను, బీజేపీని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాదిరిగా మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి ముందు ఉన్నాయని పేర్కొన్నారు.
యూపీలోని తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదల కోసం 45 లక్షల గృహాలను నిర్మించిందని, రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వార్షిక ఆరోగ్యబీమా, కరోనా సంక్షోభంలో 15 కోట్ల మందికి 28 నెలలపాటు నెలలో రెండు పర్యాయాలు ఉచితంగా రేషన్ అందిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఏ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా న్యాయంగా అమలు చేయడం లేదని, ఏదైనా పథకం అమలు చేసినా తమ పథకంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్ర వేసుకుంటోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు కాశీలో విశ్వనాథ్ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తుచేశారు.